రిజర్వాయర్లు, చెరువుల నిండా చేపపిల్లలు
జిల్లాలో ఏటేటా పెరుగుతున్న మత్స్య సంపద
ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ లక్ష్యం 2కోట్ల 89లక్షలు
ఇప్పటికే తొమ్మిది రిజర్వాయర్లు, 804 చెరువుల్లో 2కోట్ల 43లక్షలు విడుదల
96 శాతం పంపిణీ పూర్తి
వారం రోజుల్లో వంద శాతం లక్ష్యం
జనగామ, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారులకు ఉపాధి కల్పించి వారు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిస్తున్నది. ఇందులో భాగంగా జల వనరుల్లో ఉచితంగా చేపపిల్లలను వదులుతున్నది. ఇన్నాళ్లూ గుక్కెడు తాగునీటికే అల్లాడిన కరువు నేల జనగామలోనూ ఇప్పుడు పుష్కలంగా నీరుండి నీలి విప్లవం మొదలైంది. జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతుండడంతో చేప పిల్లల పంపిణీలో ఈ సారి మత్స్యశాఖ లక్ష్యానికి చేరువైంది. ఈ సారి 2కోట్ల 89లక్షల చేప పిల్లలను వదలాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటి వరకు 93శాతం పూర్తయింది. వారం, పది రోజుల్లో వంద శాతం చేప పిల్లలను జార విడిచేందుకు అధికార
యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నది. మత్స్యకారులకు ఉపాధి కల్పించి వారు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. కరువు నేల జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టుతో జలకళ వచ్చింది. దేవాదుల రిజర్వాయర్ల నుంచి చెరువుల్లోకి చేరుతున్న గోదావరి జలాలకు తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలతో జనగామ జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో చేప పిల్లల పంపిణీలో ఈసారి మత్స్యశాఖ లక్ష్యానికి చేరువైంది. ఐదేళ్లుగా జిల్లాలోని దేవాదుల రిజర్వాయర్లు, చెరువుల్లో ప్రభుత్వం నూరుశాతం సబ్సిడీపై చేప పిల్లలను పోస్తున్నది. గతేడాది 8వేల 461 టన్నుల చేపలు, 120 టన్నుల రొయ్యల ఉత్పత్తి లక్ష్యం కాగా, 8వేల 994 టన్నుల చేపలు, 128 టన్నుల రొయ్యలతో ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని అధిగమించారు. ఈ ఏడాది రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి, జనగామ మండలం చీటకోడూరు, నర్మెట మండలం మల్లన్నగండి, బొమ్మాకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లింగాలఘనపురం మండలం నవాబ్‌పేట, కొడకండ్ల మండలం బయ్యన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలంలోని రాజవరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా 804 చెరువుల్లో ఇప్పటికే 2కోట్ల 43లక్షల చేప పిల్లలు వదిలారు.
ఈసారి 2కోట్ల 89లక్షల చేప పిల్లల పంపిణీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 93శాతం చేప పిల్లల పంపిణీ పూర్తయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వచ్చే వారం, పది రోజుల్లో వంద శాతం చేప పిల్లలు జార విడిచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మత్స్యశాఖ ఆధీనంలోని 121 చెరువులు, గ్రామ పంచాయతీల ఆధీనంలోని 444 చెరువులు, 104 సొసైటీయేతర చెరువులను మత్స్య సంపద కోసం ఉపయోగిస్తున్నారు. జిల్లాలో 145 మత్స్య సొసైటీలు ఉన్నాయి. వాటిలో 20 మహిళా సొసైటీలు, 125 పురుష సొసైటీలు ఉండగా 11,136 మంది మత్స్య కార్మికులు సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది ప్రభుత్వం రూ. 1.03కోట్ల విలువైన చేప పిల్లలను పంపిణీ చేయగా రూ.3.60కోట్ల ఆదాయాన్ని మత్స్య కార్మిక కుటుంబాలు పొందాయి. జిల్లాలో నాలుగు విడుతలుగా మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల్లో దేవాదుల ద్వారా గోదావరి జలాలు నింపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
తొమ్మిది దేవాదుల రిజర్వాయర్లలో 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు ఉండే 43లక్షల 16వేల వివిధ రకాల చేప పిల్లలు వదిలారు. వాటిలో కట్ల రకం పిల్లలు 17లక్షల 26వేల 400(40శాతం), రాహు(రవ్వలు) 21లక్షల 58వేలు(50శాతం), మెరిగెలు (బంగారుతీగెలు) 4లక్షల 31వేల 600(10శాతం) నిష్పత్తిలో చేప పిల్లలను విడిచేందుకు టెండర్లు అప్పగించగా, 678 చెరువులకు గానూ 382 చెరువుల్లో ఇప్పటికే 35-40 మిల్లీమీటర్ల సైజు ఉండే కట్ల రకం చేపపిల్లలు 86లక్షల 18వేల 125 కట్ల (35శాతం), రాహు (రవ్వలు) 86లక్షల 18వేల 125 (35శాతం), సాధారణ రకం 73లక్షల 87వేల 50 చేప పిల్లలను 30శాతం నిష్పత్తిలో విడిచారు.
మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు..
ప్రభుత్వ చర్యలతో మత్స్య కార్మికుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో వలసబాట పట్టిన మత్స్యకారుల కుటుంబాలు స్వగ్రామాలకు తిరిగివచ్చి తలెత్తుకొని జీవిస్తున్నాయి. గ్రామీణ కుల వృత్తులకు పెద్దపీట వేస్తుండడంతో అనేక కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. ఒకప్పుడు ఏపీ నుంచి చేపలను తెచ్చుకొని అమ్ముకునే దుస్థితి నుంచి మన చెరువులు, నీటి వనరుల్లో చేపలు పెంచుతూ ఏటేటా మత్స్య సంపదను వృద్ధి చేసుకునే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ప్రతి ఏడాది ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి మత్స్యశాఖ ద్వారా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తుండడంతో జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.
జిల్లాలో చేపల పిల్లల పంపిణీ ఇలా..
2021-22లో చేపల సీడ్ లక్ష్యం : 2కోట్ల 89లక్షలు
జిల్లాలో గుర్తించిన నీటి వనరుల సంఖ్య : 804
5 ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్లు, చెరువులు : 383
ఇప్పటివరకు పోసిన చేప పిల్లలు : 2కోట్ల 43 లక్షలు
పూర్తయిన చేప పిల్లల పంపిణీ శాతం : 96
జిల్లాలో మొత్తం మత్య్స సొసైటీలు : 145
మహిళా సొసైటీలు : 20
పురుష సొసైటీలు : 125
మొత్తం మత్య్స కార్మికులు : 11,136 మంది
వారంలో వందశాతం పంపిణీ..