నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఎంపీవోలతో సమీక్షలో కలెక్టర్
డోర్నకల్‌లో పట్టణ ప్రకృతి వనం పరిశీలన
ప్రతి మొక్కనూ బతికించాలని ఆదేశం
అధికారుల తీరుపై అసహనం
పనితీరు మార్చుకోవాలని హితవు
మహబూబాబాద్, అక్టోబర్ 7 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూరు శాతం పన్నుల వసూలు జరిగేలా ఎంపీవోలు కృషి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. పన్నుల బకాయిలో నెల్లికుదురు మండలం మొదటి స్థానంలో ఉందన్న ఆయన మిగిలిన మండలాల్లోనూ బకాయిలు పేరుకుపోయా యన్నారు. అనంతరం డోర్నకల్ పట్టణంలోని ప్రకృతి వనంతో పాటు సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. ప్రతి మొక్క బతికేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్సీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించి వందశాతం పూర్తయ్యేలా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పలు అభివృద్ధి పనులు పరిశీలించిన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధింత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పనితీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్నుల సేకరణ జరగాలని కలెక్టర్ కే.శశాంక అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల కార్యకలాపాలపై ఎంపీవోలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు వివాహ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నా రు. అధికారులు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టినపుడు రికార్డుల తనిఖీ చేపట్టాలన్నారు. గ్రామసభలో చేపట్టిన కార్యక్రమాలను వివరించాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్టర్లు సరిచేసుకోవాలని సూచించారు. జిల్లాలో అత్యధిక పన్నుల బకాయిలు నెల్లికుదురు మండలంలో రూ.31 లక్షలతో ముందుందన్నారు. కేసముద్రం రూ. 21లక్షలు, మరిపెడ రూ. 20లక్షలు, దంతాలపల్లి, తొర్రూరు రూ.18లక్షలు, గూడూరు రూ. 15లక్షల, కురవి 14 లక్షల బకాయి ఉందన్నారు. నిరంతరం పన్నుల సేకరణ చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్స్, శ్మశాన వాటికల్లో మరమ్మతులుంటే జాప్యం చేయొద్దన్నారు. మొత్తం 702 పల్లె ప్రకృతి వనాల్లో 52 వనాలకు నేమ్ బోర్డులు, గేట్లు, వాటర్, విద్యుత్ సౌకర్యాలు ఉన్నాయి. మిగతా వాటికి లేవని త్వరలో చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీఏ పీడీ.సన్యాసయ్య, పంచాయతీ అధికారి రఘువరన్, డివిజనల్ అధికారులు నారాయణరెడ్డి, షర్పుద్దీన్, ఎంపీవోలు పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ రక్షించాలి
డోర్నకల్: పట్టణ ప్రకృతి వనంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ శశాంక అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంబేద్కర్ నగర్ రైల్వే కోటర్స్ వద్ద నిర్మించిన పట్టణ ప్రకృతి వనం, చాప్‌ల తండాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో అపరేషన్, మెడికల్ స్టోర్, గదులను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. వైద్యాధికారులు 24 గంటలు ప్రజలకు అంటుబాటులో ఉండి వైద్యసేవలందించాలన్నారు. పీహెచ్సీ ఆవరణలో చెత్తాచెదారం తొలిగించాలని సిబ్బందికి సూచించారు. వైద్యాధికారుల నియామకంపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆరో వార్డులో ఎస్సీ,బీసీ కాలనీలో రూ.70 లక్షలతో నిర్మిస్తున్న సైడ్ మెయిన్ డ్రైనేజీని పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు అంబేద్కర్ నగర్ రైల్వే క్వార్టర్స్‌లోని ఐదెకరాల్లో నిర్మిస్తున్న పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలకు సపోర్టుగా కర్రలు నాటాలని సూచించారు. మొక్కలకు గుంతలు ఏర్పాటు చేసి బోర్ వెల్స్ ద్వారా నీటిని అందించాలన్నారు. మోడల్ మార్కెట్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. మండలంలోని చాప్లతండాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, వైద్యాధికారులు రంజిత్ రెడ్డి, వీరాజిత, తహసీల్దార్ వివేక్, ఏవో పద్మజ, కౌన్సిలర్లు బోరగల్ల శరత్‌బాబు, బసిక అశోక్, తేజావత్ సంధ్యారాణి , మున్సిపల్ మేనేజర్ ఉదయ్, ఎంపీవో మున్వర్‌బేగ్, ఆర్ఐ కిషన్ రావు, చాప్‌ల తండా సర్పంచ్ బానోత్ పాండునాయక్, సీహెచ్‌వో వీరాబాబు, తదితరులు పాల్గొన్నారు.