‘దళితబంధు’ అమలు చేస్తుంటే ఎందుకింత మంట..
సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు
అడగని పథకాలు అందిస్తూ అందరివాడయ్యాడు
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
లింగాలఘనపురంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
లింగాలఘనపురం, సెప్టెంబరు 6: ‘దళితుల ఆగ్రహానికి బీజేపీ మసికావడం తప్పదు. దళిత బంధు పథకం అమలు చేస్తుంటే ఆ పార్టీకి ఎందుకంత కండ్ల మంట’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టరు తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగాలఘనపురంలో సోమవారం 20 మందికి రూ.22 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అయ్యాడని పేర్కొన్నారు. చేనేత, గీత కార్మికులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. రైతాంగానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కారు మాత్రమే అన్నారు. ఆడపిల్ల పుడితేనే భయపడే తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందిస్తూ ఆడపడుచులకు ముఖ్యమంత్రి పెద్దన్నలా మారారని పేర్కొన్నారు. నేడు దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకం అందిస్తుంటే బీజేపీ నాయకులు అక్కసు వెళ్లగగ్గుతున్నారని ఆరోపించారు. దళితులను ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికోసం కృషి చేస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే అని తెలిపారు. ఇటీవల తాను దళిత వాడల్లో పల్లెనిద్ర చేసి దళితుల స్థితిగతులపై నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి అందించానని, దానికి అనుగుణంగా పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారని వివరించారు. బీజేపీ నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ ధీరజ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, దిశ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, నాయకులు గవ్వల మల్లేశం, కేమిడి యాదగిరి, కేమిడి కవితా వెంకటేశ్, ఎడ్ల రాజు, బోయిని రాజు, వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాధితుడికి రూ. 3 లక్షల ఎల్వోసీ అందజేత
స్టేషన్ ఘన్పూర్: పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోనం ఎమ్మెల్యే రూ. 3లక్షలకు ఎల్వోసీ అందించి ఆదుకున్నారు. మండలంలోని రాఘవాపూర్ గ్రామానికి చెందిన బీ లక్ష్మీనారాయణ క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా, రూ. 3లక్షలకు ఎల్వోసిని నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రాజయ్య అందజేశారు. గతంలో లక్ష్మీనారాయణకు చికిత్స కోసం రూ.2లక్షలకు ఎల్వోసీ అందించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకు మెరుగైన చికిత్స కోసం రూ.5లక్షలకు ఎల్వోసి అందించి ప్రాణాలు కాపాడారని, రాష్ట్ర ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, నియోజకవర్గ కోఆర్డినేటర్ భాస్కర్, ఎంపీటీసీ గుర్రం రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, శివునిపల్లి గ్రామ అధ్యక్షుడు బైరి బాలరాజు, మార్కెట్ డైరెక్టర్ ఇస్రం వెంకటయ్య, మండల యూత్ అధ్యక్షుడు మారపల్లి ప్రసాద్, మండల నాయకులు గోవిందు అశోక్, జీ శ్రీహరి, పట్టణ యూత్ అధ్యక్షుడు గుండె మల్లేశ్, చిట్టిబాబు, ఆకారపు అశోక్, జోగు వినయ్, వంగ వేణు, వంగ వెంకటేశ్, రేగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.