కొత్తపేటలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలకు హాజరు
సీసీరోడ్ల కోసం అప్పటికప్పుడు రూ.10లక్షలు మంజూరు
కాలినడకన కొత్తపేట దళితవాడ సందర్శన
బయ్యారం జూలై 4 : పల్లెల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మం త్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మండలంలోని కొత్తపేటలో జరిగిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమానికి హాజరయ్యారు. కాలినడకన వీధులన్నీ కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాలు కొత్తరూపు సం తరించుకుంటున్నాయని తెలిపారు. ప్రతి నెలా రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు ప్రభుత్వం రూ. 369 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. అనంతరం కొత్తపేట విద్యుత్ సబ్స్టేషన్, పందిపాడెలో అటవీ శాఖ ప్లాంటేషన్లో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందులో కలసి మంత్రి మొక్కలు నాటారు. మండలంలోని కొత్తపేట గ్రామంలోని సింగారం -2 కాలనీ దళిత వాడలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
దళితుల జీవితాల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత క్రాంతి పథకం రూపొందించారని, బడ్జెట్లో రూ. 1500 కోట్లు కేటాయిచారన్నారు. త్వరలోనే ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కాగా, సబ్స్టేషన్ నిర్మాణానికి 2016లో 20 గుంటల స్థలం ఇచ్చామని, కుటుంబంలో ఒకరికి ఉద్యో గం ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఇవ్వడం లేదని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన గుగులోత్ మల్సూర్ అవేదన వ్యక్తం చేశారు. దీంతో ట్రాన్స్కో సీఎండీతో మాట్లాడి మంత్రి భరోసా కల్పించారు. పందిపాడె గ్రామానికి చెందిన రైతులు తమ సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని మంత్రి దృష్టికి తీసుకురాగా న్యా యం చేస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ అభిలాషా అభినవ్, డీఎఫ్వో రవి కిరణ్, ట్రాన్స్కో ఎస్ఈ నరేశ్, ఎంపీ పీ మౌనిక, వైస్ ఎంపీపీ గణేశ్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, సర్పంచ్ మమత, కోటమ్మ, రమేశ్, అని ల్, ఎంపీటీసీ కుమారి, ఉపేంద్ర, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీవో చలపతిరావు, ట్రాన్స్కో డీఈ సామ్యానాయక్, ఏడీఈ ప్రసాద్ బాబు, ఏఈ సతీశ్, నాయకులు శ్రీకాంత్, వెంకటపతి, శ్రీను పాల్గొన్నారు.
అవ్వా ఎట్లున్నవ్.. బాగున్నావా?
అవ్వ.. ఎట్లున్నవ్…బాగున్నవా ? పింఛన్ వస్తుందా ? మిషన్ భగీరథ నీళ్లొస్తున్నయా అంటూ ఓ వృద్ధురాలిని మంత్రి సత్యవతి రాథోడ్ ఆప్యాయంగా పలకరించారు. బయ్యారం మండలం కొత్తపేట ఎస్పీకాలనీలో పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న క్రమంలో దారిలో కనిపించిన ముత్తమ్మతో కాసేపు ముచ్చటించారు. ‘నీకేం కావాలమ్మ అంటే ఇల్లు, రోడ్లు కావాలమ్మ అని బదులివ్వడంతో ఆ తర్వాత నిర్వహించిన సభలో కాలనీలో సీసీరోడ్ల నిర్మాణం కోసం రూ.10లక్షలు మంజూరు చేశారు మంత్రి.