ఖైరతాబాద్, మార్చి 10: నిమ్స్ దవాఖానలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమావేశం రసాభాసగా మారింది. ఓ వైపు డైరెక్టర్ కమిషన్ చైర్మన్‌ను సత్కరిస్తుండగా, మరో వైపు వందలాది నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నిమ్స్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై కొందరు బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకురాగా.. మంగళవారం కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంంబాబు నాయక్, కొంకటి లక్ష్మినారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ బృందం నిమ్స్ దవాఖానను సందర్శించింది. ఈ నేపథ్యంలో లెర్నింగ్ సెంటర్లో డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప నేతృత్వంలో కమిషన్ సభ్యులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
నిమ్స్‌లో సిబ్బంది నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసిన విధానాన్ని వివరిస్తుండగా, ఇక్కడ నియామకాల్లో అన్యాయం జరుగుతోందని, పదోన్నతుల్లో నిబంధనలు పాటించడం లేదని, అర్హత కలిగిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయలేదంటూ ఎమ్మార్పీఎస్ నేత నవీన్ రాజు, బాధిత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎస్.సురేశ్, బి.మల్లేశ్, జైపాల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు వారిని అడ్డుకుంటూ వాగ్వాదానికి దిగగా, సమావేశం రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని బైకాట్ చేసినట్లు బాధితులు మీడియాకు తెలిపారు. త్వరలోనే కమిషన్‌ను కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
సత్కారం.. నిరసనలు
సమీక్షా సమావేశం అనంతరం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప సత్కరిస్తుండగా.. నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులతో ఆస్పత్రిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్ మాట్లాడుతూ.. అనేక దశాబ్దాలుగా నిమ్స్ దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. గత 30 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని, సీనియార్టీ ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.