
కరీమాబాద్, ఆగస్టు 9 : జవహర్ నవోదయ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2021-22 సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ నెల 11న పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 80 సీట్లుండగా, 3,688మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 26 పాఠ శాలలను ఎంపిక చేశారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష జరుగనుండగా, కొవిడ్ నిబంధనల ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కరోనా పాజిటివ్ ఉన్న విద్యార్థులు సైతం పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా సమాచారం అందజేస్తే ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో గదిలో కేవలం 12మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణపై రెండు రోజుల క్రితం అధికారులకు వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించడంతోపాటు సామగ్రిని సైతం పంపిణీ చేశారు.
నిబంధనలు పాటించాలి
జవహర్ నవోదయ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారులు సూచించిన నిబంధనలు తప్పక పాటించాలి. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించాలి. కరోనా ఉన్నా పరీక్షకు రాయొచ్చు. పరీక్ష నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించి సామగ్రిని పంపిణీ చేశాం. పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. పరీక్ష విజయవంతానికి సహకరించాలి.
-పూర్ణిమ, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయం, మామునూరు