న్యూఢిల్లీ: ఈ నెలలో ఓ మధ్యాహ్నం భోజన విరామం కోసం సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కోర్టు రూము నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయం అది. ఇంతలో మరో 10 నిమిషాల సమయం కావాలని ఓ అభ్యర్థన వినిపించింది. ఆ గొంతు ఏ సీనియర్ న్యాయవాదిదీ కాదు.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన 19 ఏండ్ల అథర్వ చతుర్వేది అనే విద్యార్థిది. 12వ తరగతి పాసై డాక్టర్ కావాలని కలలుకంటున్న అతడి వాదనలతో 10 నిమిషాల తర్వాత కోర్టులో అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తన అసాధారణ అధికారాలను ఉపయోగిస్తూ నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా నుంచి అడ్మిషన్లు కేటాయించాలని ఆదేశిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అథర్వకు అది కేవలం న్యాయపరంగా దక్కిన విజయమే కాదు, డాక్టర్ కావాలన్న అతని కల నెరవేర్చిన తీర్పు.
వివరాల్లోకి వెళితే నీట్లో రెండుసార్లు ఉత్తీర్ణత సాధించిన అథర్వకు 530 మార్కులు వచ్చాయి. అయినా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లను ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అమలు చేయకపోవడంతో అతనికి ఎంబీబీఎస్ సీటు అందని ద్రాక్షగా మారింది. దీంతో ముందుగా అతడు జబల్పూర్ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడి న్యాయమూర్తి అథర్వ వాదనకు ముగ్ధుడైనా అక్కడ అతనికి న్యాయం దక్కలేదు. తన కుమారుడు న్యాయశాస్త్రం చదువుకోకపోయినా.. కోర్టు కార్యకలాపాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడని అథర్వ తండ్రి, లాయర్ మనోజ్ తెలిపారు. కోర్టులో ఎంతవరకు మాట్లాడాలి వంటి అంశాలన్నీ అథర్వ నేర్చుకున్నాడని ఆయన చెప్పారు. క్రాస్ ఎగ్జామినేషన్లను, కోర్టు హాలులో పాటించాల్సిన క్రమశిక్షణ గురించి కొవిడ్ కాలంలో అథర్వ ఆన్లైన్లో అధ్యయనం చేశాడు. సుప్రీంకోర్టు వెబ్సైట్ పరిశీలించి స్పెషల్ లీవ్ పిటిషన్ సొంతంగా తయారుచేసి ఆన్లైన్లో దాన్ని కోర్టుకు దాఖలు చేశాడు. కోర్టు అతడి ఆవేదనను అర్థం చేసుకుంది. ప్రైవేట్ కళాశాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయలేదన్న సాకుతో అడ్మిషన్లు ఇవ్వకపోవడం అన్యాయమని స్పష్టం చేసి ఈడబ్ల్యూఎస్ కోటా కింద అర్హులైన విద్యార్థులందరికీ అడ్మిషన్లు కల్పించాలని తీర్పు ఇచ్చింది.