హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె ప్రాంతాలకు హైస్పీడ్ (బుల్లెట్) రైళ్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడం ఇప్పట్లో సాధ్యమేనా? నేటితరం ప్రజలు వాటిని చూడగలుగుతారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి దాదాపు రూ.7.50 లక్షల కోట్లు వెచ్చించబోతున్నట్టు ఇటీవల బడ్జెట్లో కేంద్రం సూత్రప్రాయంగా ప్రతిపాదించింది.
కానీ, ఆ కారిడార్లకు ప్రస్తుతమున్న రైల్వే ట్రాకులు, స్టేషన్లతో ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్ ట్రాకులు ఈ ప్రాజెక్టుకు సరిపడవు. బుల్లెట్ రైళ్లు నడిపేందుకు అవసరమైనంత సామర్థ్యం వాటికి ఉండదు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులను సరికొత్త విధానంలో నిర్మించాల్సి వస్తుంది. అందుకోసం భూసర్వే మొదలుకొని అన్ని పనులు కొత్తగా చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులు 10 ఏండ్లు చాలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ నుంచి హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి అవసరమయ్యే భూములను సేకరించడం అనుకున్నంత సులువు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం భూముల విలువ పెరుగడంతో రైతులు తమ భూములను వదులుకునేందుకు సిద్ధపడతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా ఎన్డీఏయేతర పార్టీలు అధికారంలో ఉండటంతో భూసేకరణకు సహకరించకపోవచ్చు.
హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన 3 హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల వివరాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే టెర్మినల్‌ను విమానాశ్రయానికి అనుసంధించాలని, అందుకోసం శంషాబాద్‌లో అండర్‌గ్రౌండ్ టెర్మినల్‌ను నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోనూ స్టాపింగ్ స్టేషన్లను నిర్మించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.
ప్రస్తుతం బుల్లెట్ రైళ్లు గరిష్ఠంగా గంటకు దాదాపు 350 కి.మీ. వేగంతో, సగటున 300 కి.మీ. వేగంతో ప్రయాణించగలిగేలా ఉండబోతున్నాయి. వాటి కోసం ఇప్పటివరకు భారతీయ రైల్వేల్లో స్టాండర్డ్ గేజ్ విధానంలో హైస్పీడ్ రైల్ ట్రాకులు, ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రత్యేక రైల్వే స్టేషన్లు, సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి అందుబాటులోకి వస్తే బుల్లెట్ రైళ్ల ద్వారా హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు దాదాపు 2 గంటల్లోపే చేరుకునేందుకు వీలవుతుంది.