– దాత సాయంతో ప్రాథమిక పాఠశాలకు భద్రత
– గోళ్ల గోపయ్య జ్ఞాపకార్థం గ్రిల్స్ విరాళం ఇచ్చిన కుమారుడు ఫణికుమార్
– అభినందించిన జూలూరుపాడు ఎంఈఓ జుమికిలాల్
జూలూరుపాడు, జూలై 25 : సౌకర్యాల లేమి ఆ చిన్నారులను దశాబ్దాలుగా వేధిస్తోంది. ఒకే గదిలో అన్ని తరగతులు. దానికి తోడు నిత్యం భయపెట్టే కోతుల బెడద. తరగతి గది దాటి బయట కూర్చుందామంటే కోతులు ఎక్కడ దాడి చేస్తాయోనన్న భయం. కాకర్ల హరిజనవాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు గత 20 ఏళ్లుగా పడుతున్న ఇబ్బంది ఇది. అయితే, ఓ దాత సహృదయం ఆ బడి కష్టాన్ని తీర్చింది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపి పసిపిల్లల మోముల్లో ఆనందాన్ని నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఏళ్లుగా ఒకే గదిలో విద్యను అభ్యసిస్తున్నారు. గది బయట విశాలమైన వరండా ఉన్నప్పటికీ కోతుల బెడద విపరీతంగా ఉండటంతో పిల్లలను బయట కూర్చోబెట్టలేని పరిస్థితి. ఈ సమస్యను గమనించిన దాత గోళ్ళ ఫణికుమార్ తన తండ్రి కీ.శే. గోళ్ల గోపయ్య జ్ఞాపకార్థం పాఠశాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. స్థానికుల సహకారంతో సుమారు రూ.30,000 సొంత ఖర్చుతో వరండాకు పూర్తిస్థాయిలో ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయించారు.
దీంతో ఇంతకాలం నిరుపయోగంగా ఉన్న వరండా కాస్తా.. ఇప్పుడు పిల్లలు సురక్షితంగా చదువుకునేందుకు మరో తరగతి గదిలా మారిపోయింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ గ్రిల్స్ గేటును జూలూరుపాడు మండల విద్యాశాఖాధికారి జుమికిలాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల భద్రతకు దాతలు ఇలా ముందుకు రావడం ఎంతో అభినందనీయమని, గోళ్ళ ఫణికుమార్ చేసిన ఈ సాయం ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కోతుల బెడద తప్పడంతో పాటు, చదువుకోవడానికి అదనపు స్థలం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పుల్లారావు, జెతూ రామ్ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కాకర్ల చిన్నారుల మోముల్లో ఆనందం