హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారని, ఆయన పాలనలో వారికి స్వర్ణయుగం నడిచిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. శనివారం ఆమె తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సేవలాల్ మహరాజ్ 287వ జయంతి ఉత్సవాలను ఆదివారం తెలంగాణభవన్‌లో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఉదయం 10 గంటలకు భోగ్ భండార్ కార్యక్రమం ఉంటుందని, పెద్ద సంఖ్యలో గిరిజనులు, ఆదివాసీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే సేవాలాల్ జయంతికి అధికారిక గుర్తింపు వచ్చిందని, జయంతి నిర్వహణకు ఏటా రూ.2 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో గిరిజనులకు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు 4% ఉన్న రిజర్వేషన్‌ను ఎన్టీఆర్ హయాంలో 6 శాతానికి పెంచితే, దానిని కేసీఆర్ 10 శాతానికి పెంచారని వివరించారు. 2,700పైగా గిరిజన, ఆదివాసీ, చెంచు గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేశారని తెలిపారు. హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో సేవాలాల్ మహారాజ్ భవనాన్ని, ఆదివాసీలకు కుమ్రం భీం భవనాన్ని రూ.25 కోట్లతో నిర్మించిన ఘనత కూడా కేసీఆర్‌దేనని చెప్పారు. తమ జాతి బిడ్డలపై కేసీఆర్ చూపిన ప్రేమకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
గిరిజనులు సాగుచేసుకుంటున్న 4.09 లక్షల ఎకరాల పోడు భూములకే పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని సత్యవతి రాథోడ్ తెలిపారు. సేవాలాల్ జయంతికి కేసీఆర్ అధికారిక గుర్తింపు ఇచ్చిన తర్వాతే ఇతర రాష్ట్రాల్లోనూ గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ఎస్టీలకు గురుకులాలు స్థాపించడం ద్వారా ఎంతోమంది ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవడానికి కారణమయ్యారని, ఆయనకు గిరిజనులు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు.
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి గిరిజనులు, ఆదివాసీలమంతా ఎంతో పట్టుదలతో ఉన్నామని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రామచంద్రునాయక్, వాల్యానాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్‌నాయక్, బీఆర్ఎస్ నేతలు కరాటే రాజునాయక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.