న్యూఢిల్లీ: మిస్సింగ్ కేసుల్లో ఎఫ్ఐఆర్ వెంటనే నమోదుచేయాలంటూ ఇంతకుముందు జారీచేసిన ఉత్తర్వులు..వయసు, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టతనిచ్చింది. ఉత్తర్వుల్లో ‘వ్యక్తి’ అనే పదం కేవలం పిల్లలను మాత్రమే సూచిస్తున్నదని, పెద్దలకు వర్తించదని కొన్ని రాష్ట్రాలు భావించటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
ఇంతక్రితం తాము జారీచేసిన ఉత్తర్వులో భాష స్పష్టంగా, సందేహానికి తావు లేకుండా ఉన్నదని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా పేర్కొన్నది. ఏదైనా రాష్ట్రం ఉత్తర్వును పాటించటంలో విఫలమైతే సంబంధిత ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ధిక్కార నోటీసు జారీ చేస్తామని హెచ్చరించింది.