నెల్లికుదురు, అక్టోబర్ 1: మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామం నుంచి 10 మంది దేశ రక్షణ కోసం జవాన్లుగా కశ్మీర్లో సేవలందిస్తున్నారు. గ్రామంలో మొదటగా నిలుగొండ యాకాంబ్రం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా కశ్మీర్లో పనిచేశాడు. అతన్ని ఆదర్శంగా తీసుకుని ఆ గ్రామానికి చెందిన మహ్మద్ రహీంపాషా ఉద్యోగం సాధించాడు. ఇలా గ్రామంలో ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతూ దేశ రక్షణ కోసం మేము సైతం అంటూ 10 మందికి పైగా ఆర్మీలో పనిచేస్తున్నారు. మరో ఐదుగురు శాంతిభద్రతలు కాపాడే పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. బార్డర్లో పనిచేసే ఈ దేశ రక్షకులు కుటుంబాలకు దూరంగా ఉండి, 6 నుంచి 8 నెలలకోసారి మాత్రమే స్వగ్రామానికి వస్తూంటారు. ఆర్మీలో ఎవరైనా కనిష్ఠంగా 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తేనే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయి. కరోనా కష్టకాలంలో గ్రామంలో చిక్కిపోయిన సైనికులు పలువురికి మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు ఉచితంగా అందించారు.
గ్రామానికి చెందిన సైనికులు వీరే..
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా నిలిగొండ యాకాంబ్రం కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మహ్మద్ రహీంపాషా సీఆర్పీఎఫ్ హైదరాబాద్‌లో, పిడుగు రవి బీఎస్ఎఫ్ కశ్మీర్లో, పిడుగు సుమన్ ఆర్మీ కశ్మీర్లో, తాళ్ల రమేశ్ ఉత్తరప్రదేశ్‌లో ఎస్ఎస్బీగా పనిచేస్తున్నారు. జీ నరేందర్ నేపాల్ బార్డర్లో ఎస్ఎస్బీగా, షేక్ బషీర్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఐటీబీపీలో, లవిశెట్టి మహేశ్ సీఆర్పీఎఫ్గా ఛత్తీస్‌గఢ్‌లో, ఎస్కే ఉస్మాన్ కశ్మీర్లో ఆర్మీ సోల్జర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు పిడుగు చంద్రయ్య పీసీ కేసముద్రం, పెరుమాండ్ల మురళి, వీ సోమయ్య, మాదగాని కృకిష్ణ, మాదగాని సంతోష్ పోలీసు శాఖల్లో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తి స్తూ శాంతిభద్రతలను కాపాడుతున్నారు.
చాలా గర్వంగా ఉంది..
దేశ రక్షణలో భాగస్వాములవడం గర్వంగా ఉంది. 6 నుంచి 8 నెలలకోసారి మాత్రమే ఇంటి కెళ్లే అవకాశం ఉంటుంది. దేశ సరిహద్దుల్లో ఎలాంటి సౌకర్యాలు లేని ప్రదేశాల్లో తిరుగుతుంటాం. కుటుంబసభ్యు లను కలిసే అవకాశం చాలా రోజుకోసారి వస్తుంది. 10 మంది సైనికులు బార్డర్లో పనిచేస్తుండడంతో మా గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. ఒకరిని చూసి ఒకరు.. దేశ రక్షణకు ముందుకు వస్తున్నారు.