కేసముద్రం, డిసెంబర్9: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీరు రావడం, ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు పడడంతో బావుల్లో, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సన్న రకం వంగడాలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు వాటినే సాగు చేశారు. నీరు పుష్కలంగా, 24 గంటల విద్యుత్ సరఫరా ఉండడంతో రైతులు వరి సాగుకు ప్రా ధాన్యం ఇచ్చారు. ఈ ఏడాది వానాకాలంలో జిల్లాలో 98 వేల ఎకరాల్లో వరిని సాగు చేశారు. వాతావ రణం అనుకూలించడం, నీరు సమృద్ధిగా ఉండడంతో పంట దిగుబడులు ఆశించిన మేర వచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి కోతలు ప్రారంభించగా, పంట చేతికి అందివస్తున్నది. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని విక్రయానికి తీసుకువస్తున్నారు. రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే అక్కడ మద్దతు ధర కంటే మార్కెట్లోనే సన్నరకం ధాన్యానికి ధర అధికంగా పలుకుతోంది. దీంతో ఎక్కువ మంది రైతులు మార్కెట్లో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని మాత్రమే రైతులు సెంటర్లకు తరలిస్తున్నారు.
కేసముద్రం నుంచి ఆంధ్ర, తమిళనాడు రాష్ర్టాలకు..
వరుస వర్షాలు, వాతావరణం అనుకూలించకపోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో వరి పంట దిబ్బతిన్నది. దీంతోపాటుగా తెలంగాణలోని మిర్యాలగూడ, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేసముద్రం నుంచి ధాన్యం ఎగుమతి అవుతోంది. ఇక్కడి ధాన్యం నాణ్యతగా, నూక శాతం తక్కువగా ఉండడంతో వ్యాపారులు ఎక్కువగా కొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన వ్యాపారులు కేసముద్రంలోనే ఉంటూ ధాన్యం ఖరీదులు చేపట్టి లారీల ద్వారా తరలిస్తున్నారు. అంతేకాకుండా యాసంగిలో సాగు చేసిన ధాన్యం నూక శాతం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేమని చెబుతోంది. ఈ మేరకు యాసంగిలో ధాన్యం సాగు చేయకుండా లాభాలు వచ్చే ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట్రప్రభుత్వం గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నది. యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గుతుండడం, పొరుగు రాష్ర్టాల్లో వానాకాలంలో పంట దెబ్బతిన్న కారణంగా సన్న రకం ధాన్యానికి డిమాండ్ వస్తున్నది. నేరుగా వ్యాపారులు కల్లాల వద్దకు వెళ్లి ఖరీదు చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యానికి ఆర్డర్లు అధికంగా వస్తుండడంతో పోటీ పడి వ్యాపారులు కొని ఎగుమతి చేస్తున్నారు.
ధర మంచిగుంది
వానాకాలంలో రెండెకరాల్లో వరి పంటను సాగు చేశా. నీరు, కరంటు ఉండడంతో దిగుబడి మంచిగా వచ్చింది. మార్కెట్లో సన్నరకం ధాన్యానికి ధర ఎక్కువగా పడుతుందని తెలువడంతో అమ్మడానికి తీసుకువచ్చా. వ్యాపారులు క్వింటాల్ ధాన్యానికి రూ. 1989కి తీసుకున్నారు.
నాణ్యమైన ధాన్యాన్ని తేవాలి
మార్కెట్‌కు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకవచ్చి గరిష్ఠ ధర పొందాలి. మట్టి పెల్లలు, చెత్తాచెదారం, తేమ శాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని విక్రయానికి తీసుకవచ్చినట్లయితే క్వింటాల్‌కు రూ.2 వేల కంటే అధికంగా పొందవచ్చు. వ్యాపారులకు ధాన్యం ఆర్డర్లు అధికంగా ఉండడంతో మార్కెట్లో ధర ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా పలుకుతోంది. సన్న రకం ధాన్యం కేసముద్రం నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతోంది.