మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 16 : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. నాలుగు రోజుల నుంచి సొసైటీకి సరిపడా యూరియా రావడం లేదు. ఈ క్రమంలో లారీ లోడ్ వచ్చి సొసైటీలో దించుతున్నారని సమాచారం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. యూరి యా ఇవ్వాలని సొసైటీ అధికారులను రైతులు నిలదీశారు. ఈ క్రమంలో అధికారులు పట్టణ పోలీసులకు స మాచారం అందించడంతో ఇద్దరు ఎస్సైలు, ఐదుగురు కానిస్టేబుల్స్ వచ్చి సొసైటీ సెంటర్ వ ద్ద రెండు గంటల పాటు పహారా చేశారు. సొసై టీ నిర్వాహకులు రైతులకు టోకెన్ల ప్రకారం కాకుండా ఇష్టానుసారం ఇస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో యూరియా గోదామును మూసివేశారు. దీంతో సొసైటీ సీఈవో ప్రమోద్‌తో రైతులు వాగ్వాదానికి దిగారు. గోదాములో 400 బస్తాల యూరియా ఉంద ని, రైతులు వెయ్యి మంది వరకు ఉన్నారని మళ్లీ లోడ్ వచ్చాకే యూరియా ఇస్తామని అధికారులు సిబ్బందితో గేటుకు తాళం వేయించి రైతులను పోలీసులతో వెళ్లగొట్టారు.
వారం రోజులుగా యూరియా కోసం సొసైటీకి వస్తూ అరిగోస పడుతున్నం. పొద్దుగాలే ఐదు గంటలకు వచ్చినం. అప్పటినుంచి లైన్లోనే నిలబడి ఉన్నాం. ఇదివరకు యూరియా కోసం ఇంత గోస పడలే. ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతున్నం. కొంతమందికి మాత్రమే యూరియాను అందించి బ్లాక్ చేస్తున్నరు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి.
జోరువానలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కొరత అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. స్టాక్ ఎప్పుడొస్తుందో తెలియక దొంగరాత్రి లేచి సొసైటీల వద్దకు పరుగులు తీయాల్సి వస్తున్నది. శనివారం మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో తెల్లవారుజాము 3గంటల నుంచే కొన్నిచోట్ల చెప్పులు క్యూలో పెడితే.. మరికొన్ని సెంటర్ల వద్ద చేతిలో గొడుగులు పట్టుకొని బారులు తీరిన దృశ్యాలే కనిపించాయి. వర్షాన్ని కూడా లెక్కచేయక గంటల తరబడి ఎదురుచూసినా చాలామందికి యూరియా అందకపోవడంతో భగ్గుమన్న రైతులు.. సొసైటీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. యూరియా కోసం గతంలో ఎప్పుడూ ఇంత గోస పడలేదని కాంగ్రెస్ సర్కారు వచ్చాకే రైతులకు కష్టాలు మొదలయ్యాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
ఖానాపురం : ఖానాపురం మండలం బుధరావుపేటలోని సొసైటీ కార్యాలయం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. గోదాముకు 888 బస్తాలు రావడంతో అధికారులు రైతువేదిక వద్ద రైతులకు టోకెన్లు ఇచ్చారు. వర్షం కురుస్తున్నా యూరియా కోసం గోదాము వద్ద నిలబెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ క్యూలైన్లలో నిలబడి యూరియా కొనుగోలు చేసింది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.
బయ్యారం/కేసముద్రం : బయ్యారంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద శనివారం యూరియా కోసం వందలాది మంది రైతులు చెప్పులు వరుసలో పెట్టారు. కేవలం 220 బస్తాలు యూరియా రాగా తహసీల్దార్ నాగరాజు, ఎస్సై తిరుపతి యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని గ్రోమోర్ సెంటర్ వారికి అదేశించి పోలీస్ పహారాలో యూరియా పంపిణీ చేశారు. కొన్ని సెంటర్ల నుంచి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నార ని రైతులు ఆరోపించారు. కేసముద్రంలోనూ రైతులు యూరియా కో సం నానా పాట్లు పడ్డారు. ధన్నసరి, కేసముద్రం సహకార సంఘాలకు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఉదయాన్నే బారులు తీ రారు. నిల్చోలేక ధన్నసరి సొసైటీ వద్ద చెప్పులను క్యూ పెట్టారు. మధ్యా హ్నం వరకూ యూరియా రాలేదు. ఏవో వెంకన్న ధన్నసరి, కేసము ద్రం సహకార సంఘాలకు చేరుకొని రైతులతో మాట్లాడారు. వర్షం కారణంగా యూరియా రాదని తెలుపడంతో నిరాశతో వెళ్లిపోయారు.
గూడూరు, ఆగస్టు 16 : మహబూబాబాద్ జిల్లా గూడూరు పీఏసీఎస్‌లో శనివారం యూరియా బస్తాలు ఇస్తున్నారని తెలుసుకున్న రైతన్నలు తెల్లవారు జామున 3గంటలకే కుటుంబసభ్యులతో కలిసి సొసైటీ వద్ద వందలాదిగా చేరుకున్నారు. అదే సమయంలో వర్షం పడినా లెక్కచేయకుండా 6 గంటలు వరుసలోనే గొడుగులు పట్టుకొని పడిగాపులు కాశారు. రెండు లారీల్లో వచ్చిన 888 బస్తాల యూరియాను ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పంపిణీ చేశారు. మధ్యాహ్నం వరకు నిల్వలు అయిపోవడంతో యూరియా కావాలంటూ క్యూలో ఉన్న రైతులు, మహిళలు, వృద్ధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో ఆందోళనకు సిద్ధం కాగా ఎస్సై గిరిధర్‌రెడ్డి అదుపు చేసి మిగితా వారికి తెల్లకాగితంపై పీఏసీఎస్ సిబ్బంది సంతకం చేసి ఇచ్చిన టోకెన్లను స్వయంగా ఇచ్చారు. అయితే యూరియా కోసం తెల్లవారుజామున నుంచి నీళ్లు తాగకుండా, ఏమీ తినకుండా వచ్చి లైన్లలో నిల్చొంటే ఒక్కబస్తా సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రెండు బస్తాలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంత అధ్వాన పరిస్థితి ఎన్నడూ చూడలేదని కనీసం వ్యవసాయం చేద్దామంటే యూరియా బస్తాలు దొరకని పరిస్థితి దాపురించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక క్యూలైన్లలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు సైతం అనేక ఇబ్బందులు పడ్డారు. కాగా యూరియా బస్తాలు ఇచ్చే ప్రక్రియను ఏవో అబ్దుల్ మాలిక్ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు పర్యవేక్షించారు. లైన్లనో నిలబడి శనివారం రోజు యూరియా బస్తాలు దొరకని వారికి మళ్లీ యూరియా లోడ్ వచ్చిన తర్వాత ప్రాధాన్యత ప్రకారం ఇస్తామని ఎస్సై, ఏవోలు రైతులకు తెలిపారు.