మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టేబుల్ కింద చేయి పెడితే తప్పా.. ఇక్కడ ఫైల్ ముందుకు కదలడం లేదు. లర్నింగ్, శాశ్వత, ఏవీ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు వాహన ఫిట్నెస్లు, రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ తదితర పనులకు రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. ఈ శాఖలో ఇంత అవినీతి తాండవం చేస్తున్నా ఏసీబీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
– మహబూబాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ)
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి మరింత పెచ్చుమీరింది. ఇక్కడ ప్రతి పనికీ రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. టేబుల్ కింద చేయి పెట్టనిదే ఫైళ్లు ముందుకు కదలవు. జిల్లా అధికారిపై ఎవరి అజమాయిషీ లేకపోవడం, జిల్లా పాలనా అధికారి పర్యవేక్షణాలోపం, జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఈ శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నచందంగా అవినీతి తాండవం చేస్తున్నది. అవినీతి అధికారులపై దృష్టి సారించాల్సిన ఏసీబీ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యం వందలాది మంది వాహనదారులు లర్నింగ్, శాశ్వత, ఏవీ డ్రైవింగ్ లైసెన్స్‌లతోపాటు వాహన ఫిట్నెస్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల రెన్యువల్ తదితర పనుల కోసం వస్తుంటారు.
డీటీవో, ఇద్దరు అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఇద్దరు అసిస్టెంట్ మోటరు వెహికిల్ ఇన్స్పెక్టర్లలో ఒకరు పూర్తిగా రోడ్ల మీద వాహనాలు చెకింగ్ చేస్తుంటారు. ఇంకో అసిస్టెంట్ మోటరు వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పనులు చూసుకుంటారు. ఉదయం 10.30 గంటలకు కార్యాలయానికి రావాల్సిన అధికారి, తన పనులన్నీ చూసుకొని తీరుబాటంగా మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాతనే కార్యాలయానికి వస్తారు. ఇతను వచ్చేలోపు రవాణా శాఖలోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు పనులన్నీ చక్కబెడుతారు. మోటరు వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఇన్చార్జీ డీటీవో) కార్యాలయానికి రెండు రోజులకోసారి మాత్రమే వస్తాడు. అది కూడా సాయంత్రం 4 గంటలకు అలా వచ్చి 5 గంటలకు ఇలా వెళ్లిపోతాడు.
ఇక పెద్దసారు రానీ రోజు మాత్రం ఫైళ్లన్నీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడకే సంతకాల కోసం వెళ్తాయి. పెద్దసారుకు ఇక్కడ ఇన్కమ్ ఎక్కువగా ఉండడంతో మానుకోట రవాణా శాఖ కార్యాలయ పోస్టును వదులుకో లేకపోతున్నాడు. ఇక ఇక్కడ లర్నింగ్ లైసెన్స్ కావాలంటే టూ వీలర్‌కు ప్రభుత్వ ఫీజు రూ.350 ఉంటే రూ.వెయ్యి, టూ అండ్ ఫోర్ వీలర్‌కు ప్రభుత్వ ఫీజు రూ.550 ఉంటే రూ.2వేలు, టూ, ఫోర్, సిక్స్ వీలర్ వాహనాలకు ప్రభుత్వ ఫీజు రూ.700 ఉంటే రూ.3వేలు వసూలు చేస్తున్నారు. బ్యాడ్జి, ఏవీ లైసెన్స్ కోసం వచ్చే వారి నుంచి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా ఏసీబీ అధికారులు కన్నెత్తి చూడడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు స్పందించి ఈ కార్యాలయంలో ఏజెంట్ల దగ్గరి నుంచి అధికారుల వరకు నిఘా పెంచి, దాడులు నిర్వహించాలని వాహనదారులు కోరుతున్నారు.