‘ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి శైవ క్ష్రేతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉపవాస దీక్ష చేపట్టి ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు భోళా శంకరుడి దర్శనం కోసం బారులు తీరారు. పరమేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు.
హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి, వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వర, కోటి లింగాల ఆలయాలు, ములుగు జిల్లాలోని రామప్ప, జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరం, కోటగుళ్లు, మహబూబాబాద్‌లోని కురవి వీరభద్రస్వామి, జనగామలోని పాలకుర్తి సోమేశ్వరాలయం, కొడవటూరు సిద్ధులగుట్టతో పాటు అన్ని ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఐనవోలులో మల్లికార్జునస్వామికి ప్రీతిపాత్రమైన పెద్దపట్నంను ఒగ్గు పూజారులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో శివపార్వతుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తుల జాగరణ కోసం ఆలయాలు, ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. – నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 26