హనుమకొండ, జూన్ 28 : ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం పీవీ 104వ జయంతి సందర్భంగా హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంతో పాటు జేఎన్‌ఎస్‌లోని పీవీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, పీవీ సోదరుడి కుమారుడు మధన్మోహన్రావుతో కలిసి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.
అనంతరం ఆయన మధుసూదనాచారి మాట్లాడుతూ మారుమూల పల్లె నుంచి వచ్చిన పీవీ దేశ ప్రధానిగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. బహుభాషా కోవిదుడిగా సంసరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని ఆయన వివరించారు. అనేక పదవులను అలంకరించి కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చిన గొప్ప నాయకుడైన పీవీని ఆ పార్టీ విస్మరించడం శోచనీయమన్నారు.