భీమదేవరపల్లి, జనవరి 12 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో రెగ్యులర్ టీచర్లను నియామకం చేయాలని స్థానిక సర్పంచ్ మాచర్ల కుమార స్వామి ఐసీడీఎస్ సీడీపీఓ స్వరూపను కోరారు. సోమవారం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం (కోడి గుడ్లు, పాలు, బాలామృతం) పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ కుమారస్వామి మాట్లాడుతూ.. చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆట – పాటలతో పాటు బాలింతలు, గర్భిణుల సంక్షేమంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సుశీల, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.