ములుగు, సెప్టెంబర్30(నమస్తేతెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తున్నారు. ములుగు జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపంతో రాజకీయ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులైనప్పటికి జిల్లాలోని పలు గ్రామాల్లో రాజకీయ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించలేదు. వాల్ రైటింగ్లను సైతం చెరిపేయడం లేదు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న గ్రామాల్లో ఎప్పటి మాదిరిగానే బెల్ట్ షాపులకు ఆటోలు, గూడ్స్ వాహనాల ద్వారా షాపుల యజమానులు మద్యాన్ని రవాణా చేస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులు విధు ల పట్ల అలసత్వం వహిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. సోమవా రం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లాలోని అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించినప్పటికీ జిల్లా అధికార యం త్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో మంగళవారం సైతం రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చా యి.
దీనికి మల్లంపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి వెంట మంత్రి సీతక్కతో పాటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ నిదర్శనంగా నిలిచింది. ఈ ఫ్లెక్సీని తొలగించకపోవ డానికి గల కారణాలను జీపీ కార్యదర్శి పోలు రాజును వివరణ కోరగా తొలగింపజేస్తామని తెలిపారు. వెంకటాపూర్ మండల కేంద్రంతో పాటు లక్ష్మీదేవిపేట గ్రామంలో ఉన్న లిక్కర్ షాపుల నుంచి మంగళవారం సైతం బెల్ట్ షాపులకు ఊరూరా మద్యాన్ని సరఫరా చేశారు. ఇప్పుడే పరిస్థితులిలా ఉంటే ఎన్నికల నిర్వహణలో ఎన్ని అవకతవకలు జరగుతాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.