నర్సంపేట, ఆగస్టు17 : రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పు లు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐవోబీ) పరిధిలో అలంకానిపేట, తోపనపెల్లి, బొల్లికొండ, పెద్దకొర్పోలు, రెడ్యానాయక్తండా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని రైతులు 2018 తర్వాత 1270మంది రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.లక్షలోపు 700 మంది, రూ.లక్షన్నర లోపు 350మంది, రూ.2లక్షల లోపు 170మంది రుణాలు తీసుకున్నారు.
వీరిలో ఇప్పటివరకు కేవలం 384మంది రైతులకు మాత్రమే రుణమాఫీ కాగా, 886 మందికి అర్హత ఉన్నా కాలేదు. రూ.లక్ష, రూ.లక్షన్నర లోపు 320 మంది, రూ.2లక్షల లోపు 64మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి. మిగితా రైతులు బ్యాంకుకు వెళ్లి అడిగినా ఎవరూ సమాధానం చెప్పడం లేదు. బ్యాంకు ఎదుట, వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేసినా పట్టించుకునే వారు లేరు. రైతులందరికీ రుణమాఫీ వస్తుందని చెబుతున్నారు కానీ, సమస్యను పరిష్కరించడం లేదని రైతులు వాపోతున్నారు.