ఆర్మూర్‌టౌన్, ఏప్రిల్ 29: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధుల గుట్టపై చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సూచించారు. సిద్ధుల గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లు గమనించిన కొందరు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పందించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా అటవీశాఖాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి చిరుత పులి కదలికలు కనిపెట్టాలని సూచించారు. చిరుతను బంధించి అడవిలో వదిలేలా చర్యలు తీసుకొని, భక్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చిరుతపులి సంచారంపై సంబంధిత అధికారులు ప్రకటన చేసే వరకు గుట్టపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సిద్ధుట గుట్టపై చిరుత సంచారం నేపథ్యంలో ఎఫ్ఆర్వో శ్రీనివాస్, సిబ్బందితో కలిసి గుట్టను మంగళవారం పరిశీలించారు. చిరుత ఉన్నట్లు నిర్ధారించడానికి ట్రాప్ కెమెరాలను అమర్చనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి, వారి సూచనల మేరకు చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.