Warangal | వరంగల్ చౌరస్తా : ఆస్పత్రుల అవసరాలకు తగినంత సిబ్బందితో సేవలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయి కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆయన సందర్శించారు. విభాగాల వారీగా అందుతున్న సేవల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలను బట్టి అవసరమైన విభాగాలకు వైద్యులను ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ హాస్పిటల్ పూర్తి సమాచారంతో కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్‌ను ఆదేశించారు. హాస్పిటల్‌ను సందర్శించిన సమయంలో ఆయన వెంట ప్రొఫెసర్ చిలుక మురళి, ఆర్ఎంఓ డా. దీపక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.