హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 9: ప్రైవేట్ పాఠశాలల పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ ఎన్రోల్మెంట్ చేయని ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న రీజినల్ పెన్షన్ ఆఫీస్‌లో అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ని కలిసి ప్రైవేట్ పాఠశాలను చేస్తున్న అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రంజిత్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షురాలు అనుష మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న అనేక ప్రైవేట్ పాఠశాలలు వారి దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంలేదని, పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారని వాపోయారు.
చాలా పాఠశాలలు తమ వద్ద ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ ఎన్రోల్మెంట్ నిర్వహించకుండా వారి జీవిత భద్రతని గాలికి వదిలేసారని, ఆయా పాఠశాలలపైన విచారణ చేపట్టి వారిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వినయ్, లావణ్య, వంశీ, ఎస్ఎఫ్ఐ నాయకులు పీడీఎస్‌యూ నాయకులు ముష్రాఫ్, లోకేష్ పాల్గొన్నారు.