చెరువుల మరమ్మతుకు గ్రహణం పట్టింది. మహబూబాబాద్ జిల్లాలో గతేడాది భారీ వర్షాలతో 134 చెరువులు తెగిపోగా, అవి ఇప్పటి వరకు మరమ్మతుకు నోచుకోలేదు. వానకాలం సమీపిస్తున్నా ఆ పనుల ఊసే వినబడడం లేదు. తెగిపోయిన తటాకాలతో గతేడాది వానకాలం, యాసంగి పంట సా గు చేయలేదని, సర్కారు పనితీరుపై రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈసారి కూడా తెగిన చెరువుల కింద సాగు కష్టమేనని పెదవి విరుస్తున్నారు.
మహబూబాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : గతేడాది ఆగస్టు 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో కురిసిన అతి భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 134 చెరువు కట్టలు తెగిపోగా, 8 చెక్‌డ్యాంలు సైతం వరద తాకిడికి కొట్టుకుపోయాయి. అనేక చోట్ల రోడ్లు కూడా కొట్టుకపోయాయి. చెరువు కట్టలు, వాగుల్లో ఉన్న చెక్‌డ్యాంలు తెగిపోయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే రోహిణి కార్తె ప్రారంభమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిధులు కేటాయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1590 చెరువులు ఉండగా, వీటి ఆధారంగా లక్ష ఎకరాలకు పైగా సాగవుతున్నది. గతేడాది వానకాలంలో అతిభారీ వర్షాలతో వరద ఉధృతి పెరిగి 134 చెరువులు తెగిపోయాయి. ఇందు లో 25 చెరువులకు రైతులు స్వచ్ఛందంగా గండ్లు పూడ్చుకొని మరమ్మతులు చేసుకున్నారు. మిగిలిన 109లో 10 చెరువులకు టెండర్లు పిలిచారు.
మిగిలిన 99లో 44 తటాకాలకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. మరో 45 చెరువులకు నిధులు కేటాయించి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ సీజన్లో టెండర్లు పిలిచి పనులు పూర్తయ్యేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా వాగుల్లో వరదతో కొట్టుకుపోయిన చెక్‌డ్యాంలను కూడా మరమ్మతులు చేయాలని రైతులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.
మహబూబాబాద్ మండలం అయోధ్య, నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి, రావిరాల చెరువులకు ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వచ్చిన వరద బయటకు వెళ్లిపోయింది. దంతాలపల్లి మండలం దాట్ల, ఆగపేట, కుమ్మరికుంట్ల చెరువులకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. కురవి మండలంలో 13 చెరువులు, చిన్నగూడూరు మండలంలో 5 చెరువుల తెగిపోగా తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. దంతాలపల్లి, నర్సింహులపేట, నెల్లికుదురు, చిన్నగూడురు మండలాల్లో 8చెక్‌డ్యాంలు తెగిపోయినా ఇప్పటి వరకు అవి మరమ్మతులకు నోచుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వానలు పడేలోగా మరమ్మతులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.