వరంగల్, జనవరి 29 : ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గందరగోళంగా మారింది. బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం ఎల్ఆర్ఎస్కు అడ్డంకిగా మారింది. కార్పొరేషన్‌కు కోట్లల్లో ఆదాయం తెచ్చి పెట్టే ఎల్ఆర్ఎస్ స్కీంపై బల్దియా అధికారులు దృష్టి సారించడం లేదు. రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో ఒక్క దరఖాస్తు కుడా బల్దియా క్లియర్ చేయలేదు. గ్రేటర్ కార్పొరేషన్లో ఎల్ఆర్ఎస్ కోసం లక్షకు పైగా దరఖాస్తులు రాగా, అందులో ఇప్పటి వరకు వందల్లో మాత్రమే అధికారులు క్లియర్ చేశారు. ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించిన సర్వేలు చేయిస్తుండడంతో బల్దియా అధికారులు కోట్లాది రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఆర్ఎస్పై దృష్టి పెట్టడం లేదు. గత రెండు నెలలుగా దరఖాస్తుల క్లియరెన్స్‌ను అధికారులు పక్కన పెట్టారు. ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయాలని కమిషనర్ నాలుగు సమీక్షలు నిర్వహించడం తప్ప చేసిందేమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సహకరించుకోని అధికారులు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ బాధ్యతను మూడు శాఖలకు అప్పగించారు. లెవల్ 1లో మున్సిపల్, 2లో రెవెన్యూ, 3లో ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమోదిస్తేనే లెవల్ 4లో దరఖాస్తుదారుడు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు లెవల్స్‌లో ఎక్కడ దరఖాస్తు ఆగిపోయినా క్రమబద్ధీకరణ కాదు. అయితే సమన్వయంతో ముందుకు సాగాల్సిన మూడు శాఖల అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. లెవల్ 1 పూర్తి చేసి పంపించిన దరఖాస్తులను లెవల్ 2లో పరిశీలించకపోవడంతో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల క్లియరెన్స్ కోసం మూడు శాఖల్లో ప్రత్యేక అధికారులను నియమించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
కొన్నింటికే క్రమబద్ధీకరణ
గ్రేటర్లో ఎల్ఆర్ఎస్ కోసం 1,01,339 దరఖాస్తులు వచ్చాయి. అందులో 6,628 లెవల్ 1 పూర్తి చేసుకొని 2కు వెళ్లాయి. వాటిలో 2,304 దరఖాస్తులను క్లియర్ చేశారు. ఇప్పటి వరకు కేవలం 280 మ్రాతమే అన్ని లెవల్స్ పూర్తిచేసుకొని క్రమబద్ధీకరణ జరుగగా, ఇంకా లక్షకు పైగా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న ప్రక్రియలో కేవలం రూ. 36 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇప్పటికైనా అధికారులు ఎల్ఆర్ఎస్పై దృష్టి సారించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.