ఇది వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం. వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం ఎనిమిది మంది రైతులు శుక్రవారం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉదయం 10 గంటలకే ఆఫీసుకు చేరుకున్న రైతులు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం వచ్చినట్లు సిబ్బందికి చెప్పారు. ధరణి సర్వర్ డౌన్ ఉందని, కొద్దిసేపటి తర్వాత రిజిస్ట్రేషన్లు చేస్తామని అన్నారు. వేచి చూసిన రైతులు పదే పదే అడగడంతో తహసీల్దార్ సెలవులో ఉన్నారని మధ్యాహ్నం తర్వాత సిబ్బంది చెప్పారు. అయితే తహసీల్దార్ సెలవులో ఉన్నప్పుడు డిప్యూటీ తహసీల్దార్‌కు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది.
ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఆ రోజుకు ప్రత్యేకంగా, సాంకేతికంగా అనుమతి ఇస్తారు. ఉన్నతాధికారులు బిజీగా ఉండడంతో శుక్రవారం రోజంతా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరగలేదు. అక్కడి సిబ్బందిని అడిగితే.. కలెక్టర్ ఆఫీసు నుంచి అనుమతి రాలేదని చెప్పారు. శనివారం బ్యాంకులు, ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూసిన రైతులకు మళ్లీ సోమవారం రావాలని సిబ్బంది చెప్పడంతో నీరసించి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ హయాంలో నిమిషాల్లో పూర్తయ్యే పని ఇప్పుడు రోజంతా కూర్చున్నా కావడంలేదని రైతులు వాపోయారు.
– వరంగల్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో భూముల క్ర య విక్రయాలు ఘోరంగా పడిపోయాయి. వ్యవసాయ భూములదీ ఇదే పరిస్థితి. కుటుంబ సభ్యులు, వారసుల మధ్య పంపకాలు తప్పితే ఇతర రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. రైతులు వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం బ్యాంకుల్లో మార్టిగేజ్ (తనఖా) లోన్లు తీసుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ఎక్కువగా జరుగుతున్నది. మార్టిగేజ్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి రైతు, బ్యాంకరు కలిసి తహసీల్దార్ ఆఫీసు కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తయితేనే బ్యాంకు లు లోను డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి.
రైతులు స్లాట్ బుక్ చేసుకుని, బ్యాంకర్లను ఒప్పించి తహసీల్ కార్యాలయానికి తీసుకుపోయిన తర్వాత ఎక్కువసార్లు సర్వర్ డౌన్ ఉంటున్నది. సర్వర్ సరిగానే ఉన్నా మామూళ్ల కోసం ఈ కారణం చెప్పి రిజిస్ట్రేషన్లు చేయడంలేదు. మరోసారి బ్యాంకర్లను తీసుకువెళ్లడం రైతుల కు ఇబ్బందిగా మారుతున్నది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మరో రోజు వరకు ఉండడానికి అవస్థలు పడుతున్నారు. ఎలాగైనా వచ్చిన రోజే పని కావాలని తహసీల్ సిబ్బందిని వేడుకుంటున్నారు. మధ్యవర్తులకు ఎంతో కొంత ముట్టజెప్పి పని పూర్తి చేసుకొని వెళ్లిపోతున్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం రైతు సమస్యలను పట్టించుకోవడంలేదు.
ఈ సమస్య ఒక్క వర్ధన్నపేట తహసీల్ కార్యాలయంలో ఉన్న ది కాదు. అంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది. సాగు భూముల రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే రైతులకు ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. సర్వర్ డౌన్ అని చెప్పి అధికారులు అన్నదాతలను మరింత ఇబ్బంది పెడుతున్నారు. ఇదే అదనుగా బ్రోకర్లు జోక్యం చేసుకుని రైతుల వద్ద డబ్బులు వసూ లు చేస్తున్నారు. మధ్యవర్తులను కలిసిన వారి రిజిస్ట్రేషన్లు మాత్రమే పూర్తవుతున్నాయి. కలవని వారిని సర్వర్ డౌన్ అంటూ, సాంకేతిక సమస్యలున్నాయంటూ చెప్పి పంపుతున్నారు.
పారదర్శకంగా, సులభం గా, అవినీతి రహితంగా, జవాబుదారీతనం పెంచేలా రెవెన్యూ సేవలందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్ర భుత్వం ధరణి పోర్టల్ సేవలను 20 20 అక్టోబరు 29న అందుబాటులోకి తెచ్చింది. ఏడాదిన్న ర క్రితం వరకు ఈ సేవలు మెరుగ్గా ఉండేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పేరును భూమాతగా మార్చుతున్నట్లు ప్రకటించింది. కొన్ని నిబంధనలను మార్చి అమలు చేస్తామని చెప్పింది. కొత్త విధానాలు ఎలా ఉన్నా ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా రైతులకు సేవలందించే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.