వరంగల్ చౌరస్తా: క్రమ శిక్షణకు మారుపేరు మా నాయకులు, కార్యకర్తలు అని ప్రగల్భాలు పలికే భారతీయ జనతా పార్టీ నాయకుల భూకబ్జా లీలలు బయటపడుతున్నాయి. స్థానికేతరులు, వృద్ధులు, మహిళల పేర్లపై ఉన్న భూములను టార్గెట్ చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు, దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరాంరెడ్డి పై మట్టెవాడ పోలీస్ స్టేషన్లో భూకబ్జా కేసు నమోదయ్యింది. గౌతమి నగరకు చెందిన బాధితుడు విశ్రాంత లెక్చరర్ ఎం. రాజేంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ పరిధిలోని 11వ డివిజన్ దత్తాత్రేయ కాలనీలో 15 -1- 487/1 ఇంటిని ఆనుకొని 8181/2018 రిజిస్ట్రేషన్ – పత్రాల ఆధారంగా సంక్రమించిన 62 గజాల ఖాళీ స్థలం ఉందన్నారు. ఇటీవల ఈ స్థలంలో గృహ నిర్మాణాన్ని చేపట్టడం కోసం అనుమతులు తీసుకొని నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో శ్రీరాంరెడ్డి అడ్డుపడ్డారని తెలిపారు. తన వద్ద ఉన్న ఎలాంటి ఆధారాలను చూపకుండా ఈ స్థలం తనదని, స్థలంలో నిర్మాణ పనులు చేపట్టినట్లయితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. దీంతో స్థానిక మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా భారతీయ శిక్షాస్మృతి 326(3), 292, 351 (2) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలో సైతం ఈ మాదిరి ఘటనలు చాలానే ఉన్నట్లు తెలిసింది. గత వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ హయాంలో నిందితుడికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.