హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన వేతనాల ( Wage Hike ) పెంపులో శాస్త్రీయత లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెరగలేదని బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ ( Dasyam Vinay Bhaskar ) పేర్కొన్నారు. కార్మికులు, కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లను పట్టించుకోలేదని ఆరోపించారు.
వేతన పెంపుదల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని, దేశానికి ఆదర్శంగా ఉండేలా శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాల పెంపుదల చేస్తామని సీఎం ప్రకటించి ఆచరణలో అమలు చేయలేదని అన్నారు. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువు భత్యం గురించి ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే వస్తున్న జీతానికి, పెరిగిన దానికి పెద్ద తేడా లేదని విమర్శించారు.
కాంట్రాక్టు లేబర్ జీవో 11 ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులకు రూ. 13,098 నుంచి రూ. 23,683 వరకు వేతనాలు పొందుతున్నారని గుర్తు చేశారు. స్కిల్డ్ కార్మికునికి రూ.19,572 ఉండగా సీఎం ప్రకటించిన వేతనం రూ. 18,500 మాత్రమేనని గతంతో పోలిస్తే 1,072 రూపాయల తగ్గిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కనీస వేతనాల సలహా మండలి బోర్డు అన్ స్కిల్డ్ కార్మికుడికి కనీస వేతనం రూ. 18, 009 కరువు భత్యాన్ని ఒక్కొక్క పాయింట్‌కు 12 రూపాయలు సిఫార్సు చేశారని గుర్తు చేశారు.
1948 కనీస వేతనాలు చట్టం ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా డాక్టర్ అట్రాయి ఫార్ములా ప్రకారం శాస్త్రీయంగా లెక్కగడితే కనీస వేతనం నెలకు రూ. 32వేలు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కనీస వేతనం రూ. 24 వేలు ఇస్తామని ప్రకటించి రేవంత్ రెడ్డి మాట మార్చాడనని ఆరోపించారు. రాష్ట్రంలో స్కీం వర్కర్లుగా అంగన్వాడీ, ఆశ , ఎన్ఆర్ఈజీఎస్ ,ఎన్ఆర్హెచ్ఎం, సర్వ శిక్ష అభియాన్ కింద మూడు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని వీరంతా ఏ కేటగిరి కిందికి వస్తారో స్పష్టత లేదని అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న వేతనాల కంటే కూడా తక్కువగాఉన్న వేతన సవరణను పునసమక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.