వరంగల్, నవంబర్ 20 : నగర పాలక సంస్థ తీరే సపరేటు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆఫీసర్ల కంటే అటెండర్లే ఎక్కువ కనిపిస్తున్నరు. ప్రతి చాంబర్లో ఇద్దరు నుంచి ముగ్గురు వారే. ఏకంగా ఒక చాంబర్‌కు ఎనిమిది మంది ఉన్నారంటే కార్యాలయ నిర్వహణ తీరు ఎలా ఉందో అర్థమవుతున్నది. పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలో చేరి రాజకీయ పలుకుబడితో దర్జాగా అటెండర్ గిరీ వెలగబెడుతున్నరు. డివిజన్లలో కార్మికుల కొరత ఉందని కార్పొరేటర్లు ప్రతి కౌన్సిల్ సమావేశంలో గగ్గోలు పె డుతున్నా, ఇక్కడ మాత్రం పీహెచ్ వర్కర్లు నేతలు, అధికారుల అండదండలతో క్షేత్రస్థాయిలో చీపురు, పార పట్టాల్సిన వారు కార్యాలయంలో అటెండర్లుగా పనిచేస్తున్నరు. వీరంతా రాజకీయ నాయకులు, బల్దియా ఉద్యోగుల బంధువులు కావడం గమనార్హం.
ప్రజారోగ్య విభాగం సెక్షన్లో ఏకంగా ఎనిమిది మంది అటెండర్లు ఉన్నారు. వీరంతా ఏం పనిచేస్తారో సెక్షన్ సూపరింటెండెంటే చెప్పాలి. దీనితో పాటు జనన మరణ చాంబర్లో నలుగురు, ఎంహెచ్వో చాంబర్ వద్ద ఇద్దరు, ఇలా ప్రతి చాంబర్ వద్ద ఇద్దరు నుంచి ముగ్గురు అటెండర్లుగా పనిచేస్తున్నట్లు రికార్డులో ఉన్నాయి. ప్రధాన కార్యాలయాల పరిస్థితి ఇలా ఉంటే సర్కిల్ కార్యాలయాల్లో 30 మందికి పైగా పీహెచ్ వర్కర్లు పనిచేస్తున్నట్లు సమాచారం. బిల్ కలెక్టర్లు, వారికి అసిస్టెంట్లుగా పారిశుధ్య కార్మికులుగా చేరిన వారిని ఏర్పాటు చేసుకుని పన్నులు వసూళ్లు చేస్తున్నారు.
ఇలా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పారిశుధ్య కార్మికులుగా చేరిన 452 మంది కార్మికుల్లో సుమారు 200 మందికి పైగా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని బల్దియా కార్యాలయంలో బాహాటంగా చెప్పుకుంటున్నారు. రాజకీయ పలుకుబడితో కొందరు ప్రధాన, సర్కిల్ కార్యాలయాల్లో దర్జాగా ఉంటున్నారు. మరికొందరు ‘వైట్‌కాలర్’ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారు. వీరు ఎలాంటి పనులు చేయరు.. కానీ వేతనాలు తీసుకుంటారు. రాజకీయ నాయకుల బంధువులు, కార్పొరేటర్ల వెంట తిరిగే నాయకులు కావడంతో వీరిని ప్రశ్నించాలంటే అధికారులు వణికిపోతున్నారు.
బల్దియాలో పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా మారింది. డివిజన్లలో కార్మికుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో డివిజన్‌కు అదనంగా కార్మికులను కేటాయించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన కార్మికులు రాజకీయ అండదండలతో దర్జాగా ఆఫీస్‌లో చేరారు. వారందరినీ క్షేత్రస్థాయిలో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే పారిశుధ్య కార్మికుల కొరత ఉండదన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎలాంటి పలుకుబడి లేని వారంతా క్షేత్రస్థాయిలో చీపుర్లు, పారలు పట్టి పనులు చేస్తుంటే రాజకీయ అండదండలు ఉన్న వారు మాత్రం దర్జాగా ఆఫీసుల్లో అటెండర్లుగా చెలామణి అవుతున్నారు. బల్దియా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బల్దియా ప్రధాన కార్యాలయంలో 63 మంది అటెండర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 14 మంది ప్రభుత్వ అటెండర్లు ఉన్నారు. మిగతా 49 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలో చేరిన వారు ఉన్నారు. మూడు బ్లాక్‌లలో ఉన్న అధికారుల చాంబర్లు 15కు మించి లేదు. పాత భవనంలో అదనపు కమిషనర్, అకౌంట్స్, సాధారణ పరిపాలన విభా గం, ప్రజారోగ్య విభాగం, జనన, మరణ విభాగం, సీఎంహెచ్వో, ఎంహెచ్వో, పన్నుల అధికారి, పీఆర్వో, బయాలజిస్ట్ అధికారుల చాంబర్లు ఉన్నాయి. కొత్త భవనంలో కమిషనర్ చాంబర్‌తో పాటు టౌన్‌ప్లానింగ్ అధికారి, ఎస్ఈ, మొదటి అంతస్తులో హార్టికల్చర్, కార్యదర్శి చాంబర్లు ఉన్నాయి. ఒక్కో చాంబర్‌కు ఒక్క అటెండర్‌ను నియమించినా 15 మంది సరిపోతారు. అందుకు విరుద్ధంగా 63 మంది అటెండర్లుగా పనిచేస్తున్నారు.