 
                                                            నీలగరి, అక్టోబర్ 31: ప్రతి అంగన్వాడీ టీచర్ బాల్య వివాహాలు, శిశు విక్రయాలు, అక్రమ దత్తతలు జరగకుండా తమ పరిధిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. శుక్రవారం నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి అంగన్వాడీ టీచర్ తమ సర్వేలో బాలికల పట్ల పూర్తి అవగాహన కలిగి బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు.
అదేవిధంగా ఒకరు లేదా ఇద్దరు అడ పిల్లలున్న గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు ఉండాలన్నారు. పిల్లలు లేని దంపతులు అక్రమంగా దత్తత తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారని వారిని కూడా పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అక్రమ దత్తత, బాల్యవిహాలు, బ్రూణహత్యలు, లైంగిక వేధింపులు, మహిళ అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అమె లేకుంటే సృష్టి మనుగడ కష్టమని చెప్పారు. ఈ సమావేశంలో సీడీపీఓ తూముల నిర్మల, సూపర్వైజర్లు, స్వరుపారాణి, ప్రణీత, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు..
 
                            