హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బోధన బకాయిలు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కేయూ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కేయూ గెస్ట్‌హస్ వద్ద పరిశోధక విద్యార్థులు, విద్యార్థిసంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం విద్యకు మాత్రం ఎందుకు సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని విమర్శించారు. విద్యారంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విద్యార్థుల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదని, గత ప్రభుత్వం మీద నిందలువేస్తూ తప్పించుకుంటుందని ఆరోపించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేస్తున్న ప్రభుత్వం ఫీజులు విడుదల మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు.
కేయూలో వరస గొడవలతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని విద్యా వ్యవస్థకు భంగం కలుగుతుందని గతంలో అనేకసార్లు వినతి పత్రాలు అందించిన దానిపై కనీసం స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి కేయూలో గొడవలకు కారణమైన వారిని అనుమతించవద్దని బయటి విద్యార్థులను క్యాంపస్, హాస్టల్లోకి రానివొద్దన్నారు. యూనివర్సిటీకి సంబంధంలేని వారు యూనివర్సిటీలో ఉంటూ సంఘాల పేరుతో విద్యా సంస్థల దగ్గర దందాలు చేస్తున్నారని ఆరోపించారు.
కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు ఆరేగంటి నాగరాజు, రీసెర్చ్ స్కాలర్స్ డి.తిరుపతి, కేతపాక ప్రసాద్, బి.శ్రీదేవి, ఏఐడీఎస్ఓ రాష్ర్ట కన్వీనర్ ఏ.సత్యనారాయణ, పిడిఎస్ యు, జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, ఎస్‌ఎస్‌యు జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయి కుమార్, డీఎస్ఏ హనుమకొండ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ, నాయకులు ఓ. చిరంజీవి, బొక్క ప్రవర్ధన్, సిహెచ్.రాజ్‌కుమార్ అభినయ్ పాల్గొన్నారు.