హనుమకొండ, జూన్ 21 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం హనుమకొండ జిల్లాకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), సభ్యత్వ నమోదుపై వర్ధన్నపేట, పరకాల నియోజక వర్గాల స్థాయి సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ), పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిలు, సోషల్ మీడియా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
వర్థన్నపేట నియోజక వర్గానికి సంబంధించి మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగే సమావేశానికి ఉదయం 11 గంటలకు కేటీఆర్ చేరుకుంటారు. దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించే పరకాల నియోజకవర్గ సమావేశానికి మధ్యాహ్నం 2 గంటలకు హాజరవుతారు. ఈ సందర్భంగా డిజిటల్ సభ్యత్వ నమోదుపై సైతం అవగాహన కల్పించనున్నారు.