వరంగల్, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వానకాలం సాగు ప్రణాళికను సిద్ధం చేసుకొని, అవసరమైన కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. వరంగల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై సమీక్ష నిర్వహించారు. జీడబ్ల్యూఎంసీ, కూడా పరిధిలో పనుల పురోగతిని తెలుసుకున్నారు. వరంగల్ నగరాభివృద్ధిపై సూచనలు చేశారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని మంత్రి కేటీఆర్కు అధికారులు తెలియజేశారు, ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనులను రానున్న నెలలో ప్రారంభిస్తామని చెప్పారు. వరంగల్ ఇన్నర్ రోడ్డు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ బస్ స్టాండ్ పనులను నెలలోగా మొదలుపెట్టి ఏడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలతో బస్టాండ్లో కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వరంగల్లో మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా పెరిగిందని, నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులున్న 51 కాలనీల్లోని 50 వేల ఇండ్లకు మిషన్ భగీరథ రెండో దశతో నీటిని సరాఫరా ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. స్మార్ట్ సిటీలో చేపట్టిన పలు పనులు దాదాపుగా పూర్తయ్యాయని, రోజుల వ్యవధిలోనే మిగతావాటిని పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. అవసరమైన కనీస వసతులతో 42 విలీన గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని మంత్రి సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్మించినట్లుగా వరంగల్ సిటీలోనూ భారీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లను ఆరేడుచోట్ల కట్టాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి ఖర్చులేకుండా అన్ని రకాల శుభకార్యాలను నిర్వహించుకునేందుకు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఈహాళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రం పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
మామునూరు విమానాశ్రయానికి సంబంధించి, అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలన్నారు. వానకాలం సాగు ప్రణాళికలను రూపొందించి జూన్ ప్రారంభం నాటికే కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముంపు సమస్యను పరిష్కరించాలని, లేదంటే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాలాల పటిష్టత కోసం మొదలుపెట్టిన పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న నాలాల పటిష్టతపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. వరద నీటితో నిండిపోయే రోడ్లను గుర్తించి సమస్యను పరిష్కరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ శాఖ కమిషనర్ సత్యనారాయణ, హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.