హనుమకొండ/ పరకాల, మడికొండ/ దామెర, జూన్ 22 : ‘మోసకారి కాంగ్రెస్ పోయి.. కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నరు. కేసీఆర్ పాలన అంటే తెలంగాణలో సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని.. కాంగ్రెస్ పాలన సకల సంక్షోభాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నా రు. సోమవారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్హాల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా జరిగిన ఆయా నియోజకవర్గాల ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియా శిక్షణ తరగుతుల సమావేశాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే గెలుపు బీఆర్ఎస్ తలుపు తడుతుందనేది స్పష్టంగా కనబడుతున్నదన్నారు. బీఆర్ఎస్ అధికారం మాత్రమే కో ల్పోయిందని, ప్రజల అనురాగం, మమకారం కోల్పోలేదన్నారు. క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా.. 2028 ఎప్పుడు వస్తుందా.. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అ వుతాడా అని రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నదన్నా రు. కార్యకర్తలు చేసే పోరాటాలు ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని నింపుతున్నాయన్నారు. ‘పదేండ్లు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నామని, ఇప్పుడు చూస్తే బాధనిపిస్తున్నదన్నారు. పదేండ్లు దేశానికి దీప స్తంభంగా నిలబడ్డ తెలంగాణకు కాంగ్రెస్ పాలనలో దశ దిశ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ చెప్పిన కళ్లబొల్లి మాటలు, 420 హామీలు, ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లను నమ్మి ప్రజలు అవకాశమిచ్చారన్నారు.

అంతులేని అబద్ధాలు, అడ్డగోలు హామీలతో వ చ్చిన కాంగ్రెస్ పాలన తెలంగాణ పాలిట ఉరితాడైన పరిస్థితి కనబడుతున్నదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పథకాల వరద కాకుండా బూతుల వరద నడుస్తున్నదని, బీజేపీ, కాంగ్రెస్‌కు పాలన అప్పగిస్తే సామంతులుగా ఉం డాల్సి వస్తున్నదన్నారు. రేవంత్‌రెడ్డి నెలకోసారి సంచులతో ఢిల్లీకి పోయి కప్పం కట్టి సామంతరాజు పదవి రె న్యువల్ చేయించుకొని రావాల్సి వస్తున్నదన్నారు. కేసీఆర్ పేదవాళ్లను చూసుకొంటే రేవంత్‌రెడ్డి పెద్దవాళ్లను అ రుసుకుంటున్నాడని, ఇకడ కమీషన్లు దండుకొని ఢిల్లీ లో కప్పం కడుతున్నాడన్నారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ఇప్పుడు రైతుబంధుతో పాటు యూరి యా ఇచ్చే దికులేదన్నారు. కేసీఆర్ పాలనలో ఆటో అన్నకు ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా వచ్చేదని, ఇపుడు లైన్లలో నిలబడే రోజులు వచ్చాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలోకి వస్తే ప్రతి గింజను కొంటామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మాట తప్పారన్నారు.

ఇప్పుడు కేంద్రం ఎంత అంటే అంతే కొంటామని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో 2.80 లక్షల కోట్ల అప్పు చేసి రైతు సంక్షేమానికి, ఉచిత కరెంటుకు, వివిధ పథకాలకు ఖర్చు చేశారని, కాంగ్రెస్ రెండున్నరేండ్లలో రూ. 4 లక్షల కోట్ల అప్పుతో ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలదీస్తే కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బందులు పెట్టే ఎవరినీ వదిలిపెట్టమన్నారు. వచ్చే ఐదేండ్లలో చిట్టినాయుడు ముఠాకు సినిమా చూపించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్కు కార్యర్తలే పట్టుగొమ్మలని, వచ్చే ఐదేండ్లు కార్యకర్తల అభ్యున్నతి బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అధికారం పోవడం వల్ల అసలైన కార్యకర్తలు ఎవరనేది తేలిపోయిందని, అధికారంలో ఉన్నపుడు వచ్చినవారు ఇప్పుడు వెళ్లిపోయారన్నారు.

రాష్ట్రంలో చేనేత కార్మికల వలసలను ఆపేందుకు, ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్ జిల్లాలో అతిపెద్ద టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేశారని కేటీఆర్ వివరించారు. గతంలో తెలంగాణ చేనేత కార్మికులు ఇతర రాష్ర్టాలకు వలస పోయేవారన్నారు. తన చిన్న ప్రయత్నంతో కిటెక్స్ కంపెనీ రూ.3,700 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిందని, కాకతీయ మెగా టెక్స్టైల్ పారులో సైతం పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు. స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో పారు ఏర్పాటు చేశామని, కొరియాకు చెందిన యంగ్ వన్ సంస్థను గుజరాత్ నుంచి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. గులాబీ జెండాతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. అడ్డిమార్ గుడ్డిదెబ్బల సీఎం అయిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని, ఈ వానపాము రేపు సీఎం పదవి నుంచి పోయిన తర్వాత ఆయన పకనున్న కుక కూడా లేవదన్నారు.

కేసీఆర్ పాలనను, కాంగ్రెస్ సర్కారు తీరును ప్రజలు ఒక్కసారి విశ్లేషించుకోవాలని కేటీఆర్ సూచించారు. తాను సాప్ట్వేర్ మాత్రమే కాదని.. లోపల హార్డ్‌వేర్ కూడా ఉందని, తనకు గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసని, గత పదేండ్లలో ఉన్నట్లుగా ఇకముందు బీఆర్ఎస్ ఉండదన్నారు. పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజక వర్గాల బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నేతలకు ఎస్ఐఆర్, డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై దిశా నిర్ధేశం చేశారు. సమావేశాల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సుధీర్‌కుమార్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతుబంధు సమితి హనుమకొండ జిల్లా మాజీ చైర్పర్సన్ లలితాయాదవ్, నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మసూద్, జోరిక రమేశ్, మాజీ కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ ప్రసంగం కార్యకర్తల్లో జోష్ నింపింది. ఆయన మాట్లాడుతున్నంత సేపు సంతోషంగా విన్నారు. రుణమాఫీ జరిగిందా? రైతుబంధు పడిందా? అంటూ కేటీఆర్ అడిగిన పలు ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానం చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని వైనాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించినప్పడు ఈలలు, చప్పట్లతో సంఘీభావాన్ని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి కృషిచేస్తానని, అందుకు తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినప్పుడు ఆనందంతో గంతులేశారు. కార్యకర్తలను వేధించే వారికి సినిమా చూపిస్తామన్నప్పుడు సైతం అదే స్థాయిలో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. కాగా, శ్రేణులు కేటీఆర్‌తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

సర్ ప్రక్రియపై ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉంటూ ఓట్లను రక్షించుకోవాలి. ఓటు లేకుంటే చనిపోయిన వారితో సమానం. కేంద్రం చెప్పిన పంటలను మాత్రమే కొనుగోలు చేస్తామని రేవంత్‌రెడ్డి క్యాబినెట్లో దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నది. ఏడు రకాల సన్నాలను మాత్రమే వేయాలని ప్రభుత్వం చెబుతున్నది. దీంతో రైతులకు నష్టం వస్తుంది. సారాన్ని బట్టి ఇష్టమైన పంటలను వేసుకోవాలి. 2024లో రైతుబంధు ఎగ్గొట్టి 2025లో మూడెకరాలకు మాత్రమే ఇచ్చి, 2026లో రెండు ఎకరాలకు మాత్రమే చెల్లించారు. కేసీఆర్ 11 విడుతల్లో రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి రూ.29వేల కోట్లు కూడా వేయలేదు. ఏడాదికి రెండు విడతలు కాకుండా ఒకే విడత ఇస్తామని ఇటీవల ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయ రంగంలో కలిగే నష్టాలపై ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించాలి.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
మడికొండ, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై విజన్ ఉన్న నేత కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు నిధులు ఢిల్లీకి, నదులు ఆంధ్రాకు వెళ్తున్నాయి. నియామకాలు లేకుండా భయానకాలు ఏర్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై గొప్ప విజన్, ఆలోచనతో ఉన్నామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్క పథకాన్ని రూపొందించింది లేదు. ప్రజలకు మోసపోవడం అలవాటు.. మాకు మోసం చేయడం అలవాటు అని ప్రకటించుకున్న ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చుతుంటే ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. కేసీఆర్ పట్టాలు ఇచ్చి ఇండ్లు నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చివేతలు చేపడుతున్నది. తెలంగాణలో ఒక ద్రోహపు పరిపాలన నడుస్తున్నది. రేవంత్‌రెడ్డి దిగజారిన భాష మాట్లాడుతున్నారు. కేసీఆర్ రైతు బతుకు బాగు కోసం చెరువులు బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు. ఉచిత కరెంటు, రైతుబీమా, రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారు. కరోనా కాలంలో లాక్డౌన్లో కూడా రైతుల ఖాతాల్లో రూ.76వేల కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన హయాంలో ఇంటి గుమ్మం ముందుకొచ్చి చేరే ఎరువులు.., ఇప్పుడు వాటికోసం నానా తిప్పలు పడాల్సి వస్తున్నది.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వయసు పెరగడంతో మతి తప్పి మాట్లాడుతున్నడు. గతంలో నర్సంపేట ప్రజలు తరిమికొడితే పరకాలకు వచ్చిన రేవూరి అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యిండు. రానున్న రోజుల్లో ఇక ఎమ్మెల్యేగా గెలవగానే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నడు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో లక్ష ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతో నియోజకవర్గ ఆడబిడ్డలకు ముందస్తుగా కుట్టులో శిక్షణ ఇస్తున్నాం. గిఫ్ట్ ఏ స్మైల్ కింద మిషన్లు కూడా అందిస్తున్నం. ఇందులో భాగంగా పరకాల, నడికూడ మండలాల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి కుట్టు శిక్షణ శిబిరాలను సందర్శిస్తే కడుపు మండిన రేవూరి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నడు. టెక్స్టైల్ పార్కులో రేవూరి అక్రమాలను అడ్డుకున్నందుకే కోపంతో మాట్లాడుతున్నడు. గతంలో రేవూరి టెక్స్టైల్ పార్కులో రూ.125 కోట్ల పనులను తప్పుడు జీవోతో రూ. 2,150 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నడు. ఈ విషయాన్ని కేటీఆర్ సహాయంతో అడ్డుకోవడంతో రూ. 25 కోట్ల కమీషన్ కోల్పోయాననే అక్కసుతో మతిలేని మాటలు మాట్లాడుతున్నడు. ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ