నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు, ఫిబ్రవరి 8 : మోస పోతే.. గోస పడ్తామని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రె డ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్‌తో కలిసి రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు.
ఈ సందర్భం గా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు రైతులకు రైతుబంధు, బోనస్, రూ.2లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు రూ.2500, వృద్ధులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు, తులం బంగారం, స్కూటీ వచ్చాయా..? అని కేటీఆర్ అడగడంతో అక్కడ ఉన్నవారు అందలేదని ముక్తంఠంతో చెప్పారు. అనంతరం రామారావు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేండ్లలో రెండు పైసల పని కూడా చేయలేదని, మరోసారి ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం వస్తే హామీలపై నిలదీయాలన్నారు. రెండేళ్ల కిత్రం వర్ధన్నపేటకు ఓ దొంగ వచ్చి మరో దొంగ రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
కనీసం రైతులకు యూరియా బస్తాలు కూడా దొరకక అనేక ఇబ్బందులు పడతున్నారని పేర్కొన్నారు. వెనుకటి రోజులు తెస్తామని చెప్పినట్టే రేవంత్‌రెడ్డి పాత రోజులు తెచ్చిండని విమర్శించారు. దొంగ మాటలు చెప్పి అరచేతిలో స్వర్గం చూపడంతో మంచి మనిషి అరూరి రమేశ్‌ను ఓడించుకున్నామని, చేసిన పొరపాటుతో బాధపడుతున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు వచ్చి మరోసారి మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు అడిగేందుకు డ్రామాలు ఆడుతారని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనని భావించాలన్నారు.

Ktr 01
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రజల అవసరాలను గుర్తించి ఎన్నికల్లో హామీ ఇవ్వని అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వర్ధన్నపేటను అభివృద్ధి చేశామని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలు, రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అందడంతో పాటుగా పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మున్సిపాలిటీ లో విలీనంగా ఉన్న తండాలను వేరు చేసే విషయంపై కూడా ఆలోచన చేస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు.
ఢిల్లీకి మూటలు మోసే రేవంత్‌రెడ్డికి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఓటు కోసం వస్తే బాకీ పడ్డ రూ.లక్ష ఇస్తేనే ఓటు వేస్తామని తేల్చి చెప్పాలని సూచించారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర, రంజాన్ తోఫా లేదని… సకాలంలో రైతాంగానికి యూరియా అందలేదని, డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు బంధు ప్రస్తుతం ఫిబ్రవరి నెల కావస్తున్నా వేయలేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవన్నీ దొంగ హామీలేనని గుర్తు చేశారు.

04
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆడవాళ్ల మెడలో పుస్తెలతాడు దొంగతనం చేసే దండుపాళ్యం బ్యాచ్ అని ధ్వజమెత్తారు. ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నామని, ఇక్కడి ప్రజలు రెండోసారి మోసపోరనే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఎక్కడో జిల్లా కేంద్రానికి రావాల్సిన మెడికల్, నర్సింగ్ కళాశాలను నర్సంపేట జిల్లా కాకున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కొట్లాడి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అభివృద్ధిని మరింత మెరుగుపర్చాడన్నారు. సమావేశంలో ఎన్నికల ఇన్చార్జిలు నాగుర్ల వెంకటేశ్వర్లు, మెట్టు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ)/పరకాల/మహబూబాబాద్ రూరల్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు ఉమ్మడి జిల్లాలోని పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పరకాల బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపు నిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్‌లో ని బైపాస్ రోడ్ నుంచి బస్టాండ్ సెంటర్, వివేకానంద స్టాచ్యూ మీదుగా మదర్ థెరిసా విగ్రహం వరకు రోడ్ షో ఉంటుంది. ఈ మేరకు జయప్రదం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రా వు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పిలుపునిచ్చారు.