న్యూఢిల్లీ: డ్రగ్స్ రెసిస్టెంట్ సూపర్ బగ్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో భారత ఫార్మా రంగం రెండు అరుదైన యాంటీ బయాటిక్ ఆవిష్కరణలను అందించింది. వీటిలో మొదటిది ముంబైకి చెందిన వోక్స్హార్ట్ నుంచి వచ్చింది. ఇది ‘సెఫెపైమ్’, ‘జిడెబాక్టమ్’ల కొత్త కలయిక అయిన ‘జైనిచ్’ను అభివృద్ధి చేసింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిన్‌స్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) తెలిపిన వివరాల ప్రకారం సున్నితమైన బ్యాక్టీరియా వల్ల వచ్చే పైలోనెఫ్రిటిస్ సహా సంక్షిష్టమైన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జైనిచ్ ఆమోదం పొందింది. ఇక రెండవ ఔషధం ఆర్కిడ్ ఫార్మా నుంచి వచ్చింది. రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా సెఫెపైమ్ ప్రభావాన్ని పునరుద్ధరించడానికి రూపొందించిన మరో సరికొత్త అణువు ‘ఎన్మెలాజోబాక్టిమ్’ను ఈ కంపెనీ కనుగొంది. కొన్ని బ్యాక్టీరియాలు యాంటీ బయాటిక్ అణువులను నాశనం చేయడానికి బీటా లాక్టామెస్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా వాటిని ఓడిస్తాయి.
ఎన్మెటాజోబాక్టిమ్ ఈ రెసిస్టెన్స్ ఎంజైమ్‌లను నిరోధిస్తుంది. తద్వారా సెఫెపైమ్ ఇన్ఫెక్షన్ను అంతం చేయడానికి వీలు కల్పిస్తుంది. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) అనేది ప్రపంచ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుల్లో ఒకటిగా మారుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పదేపదే హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్‌లు, పరాన్న జీవులు మొదలైనవి మందులకు స్పందించనప్పుడు ఏఎంఆర్ ఏర్పడుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం అసాధ్యంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కారణంగా 4.7 మిలియన్లకుపైగా మరణాలు సంభవించవచ్చనే అంచనాలున్నాయి. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఆరు ప్రయోగశాలల్లో ఒకదానిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు యాంటీ బయాటిక్స్‌ను తట్టుకోగలిగే శక్తిని కలిగి ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఇదే సందర్భంలో ప్రపంచం యాంటీ మైక్రోబయల్ పరిశోధన, అభివృద్ధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని తెలిపింది.
యాంటీ బయాటిక్స్ లేకపోతే సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ప్రాణాంతకం కావచ్చు. ఈ నేపథ్యంలో భారతదేశం సాధించిన విజయం ఒక మైలు రాయిగా నిలుస్తున్నది. ఈ సందర్భంగా లక్నోలోని సీఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాధా రంగరాజన్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను ఒక ప్రధాన ప్రజారోగ్య ముప్పుగా అభివర్ణించారు. యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగేకొద్దీ సూక్ష్మజీవులు నిరంతరం పరిణామం చెందుతూ వాటిని తట్టుకునే శక్తిని సంతరించుకుంటాయని వివరించారు.