బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం వరంగల్‌కు రానున్నారు. నగరంలో రూ. 181.45 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మోడల్ వైకుంఠధామం, సైన్స్ పార్క్, సైన్స్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ సెల్ భవనంతో పాటు హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం కాజీపేటలో భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రామన్న రాక నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కేటీఆర్ పర్యటనపై గురువారం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, కలెక్టర్లు, సీపీతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హనుమకొండ, మే4: నేడు వరంగల్‌లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హనుమకొండలో రూ. 181.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్నాబాద్ నుంచి మధ్యాహ్నం 2. 45 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా ఎర్రగట్టు గుట్ట వద్ద నున్న కిట్స్ కళాశాలకు చేరుకొని ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బాలాజీ గార్డెన్లో వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం చేస్తారు. హసన్‌పర్తిలో మోడల్ దోబీఘాట్‌ను, ఆ తర్వాత బాలసముద్రంలో నిర్మించిన హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, లష్కర్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ పార్కును ప్రారంభిస్తారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కార్మిక భవన్, పూలే భవన్ల నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు 57వ డివిజన్లో మోడల్ వైకుంఠ ధామం, హనుమకొండ హంటర్‌రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్లో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అభివృద్ధి పనులు, శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. అనంతరం కాజీపేట ఫాతిమానగర్‌లోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో 50 వేల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో పార్టీ విజయాలు, ప్రభుత్వ విజయాలు, నాడు తెలంగాణ ఎలా ఉండే ది?, నేడు ఎలా ఉంది?, తెలంగాణ వచ్చాక సాధించిన విజయా లు, అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల లాంటి విషయాలపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాగా బహిరంగ సభకు ప్రతి డివిజన్ నుంచి వెయ్యి మందికి తగ్గకుండా సమీకరించేందుకు బాధ్యులను నియమించారు. ప్రతి 50 మందికి ఒకరి చొప్పున ఇన్చార్జులను ఏర్పాటు చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి సమీక్ష.. ఏర్పాట్ల పరిశీలన
మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిథులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వరంగల్ మహా నగర అభివృద్ధికి రూ.2,500 కోట్లకు పైగా నిధులు తెచ్చామని, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. కేటీఆర్ ఒకరోజే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో రూ. 181 కోట్ల 45 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్ ఎం సుధీర్‌కుమార్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.