హనుమకొండ, ఏప్రిల్ 20 : రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్‌పై.. బుట్టాచోర్గాళ్లు, బట్టేబాజ్‌గాళ్లు చిల్లర మాటలు మాట్లాడితే సహించేది లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు హెచ్చరిక చేశారు. బీజేపీ బఫూన్గాండ్ల పార్టీ అని ఏది పడితే అది మాట్లాడితే తిరగబడి బుద్ధిచెపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, వరంగల్ నుంచే ఇది మొదలు కావాలని సూచించారు. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవని, టీఆర్ఎస్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారికి గట్టి సమాధానం చెప్పాలన్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో బుధవారం సాయంత్రం జరిగిన రెండు జిల్లాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. 60ఏళ్లలో జరుగని అభివృద్ధిని ఆరున్నరేళ్లలో చేసి చూపించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత పరిస్థితులను విశ్లేషించుకోవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు అడుగడునా అన్యాయం చేస్తున్నదని లెక్కలతో సహా వివరించారు. ఏడున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి రూ.3లక్షల 65వేల797 కోట్లు ఇచ్చిందని, కేంద్రం తెలంగాణకు ఇచ్చింది రూ.లక్ష68వేల640 కోట్లు మాత్రమేని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ర్టాలకు ఇచ్చిన, వచ్చిన నిధుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసరడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
కచ్చితమైన లెక్కలు కాబట్టే కేటీఆర్ అంత పెద్ద సవాలు విసిరారని, బీజేపీ నేతల పసలేని మాటల గురించి ప్రజలకు తెలుస్తుందని శ్రేణులు చర్చించుకోవడం కనిపించింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బీజేపీ తీరును కేటీఆర్ ఎండగట్టడం యువతలో ఆలోచనలు రేకెత్తించింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే కోచ్ ఫ్యాక్టరీపై పార్లమెంట్లో అడిగితే కొత్తగా కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించదని మంత్రి పేర్కొన్నారు. 2016లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అడుగగానే మంజూరు చేసి, 2018లో పూర్తి చేసిందని చెప్పారు. పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కిన బేకార్, లుచ్చా పార్టీ బీజేపీ అని ఘాటుగా విమర్శించారు. ఇవన్నీ తెలియని కొందరు కుక్కల్లా మొరుగుతున్నారని, చిల్లరమల్లర నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ఆద్యంతం బీజేపీ తీరును ఎండగడుతూ సాగిన కేటీఆర్ ప్రసంగంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండింది. తెలంగాణపై, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు కేటీఆర్ ఈ వేదిక నుంచి గట్టి సమాధానం ఇవ్వడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. మొత్తానికి మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం కావడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
‘పద్నాలుగేండ్ల పాటు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేసినా అన్నింటిని ఓర్చుకొని శివుడు గద గరళాన్ని మింగి ప్రపంచాన్నిఎట్ల కాపాడే ప్రయత్నం చేసిండోఅదే పద్ధతుల్లో తెలంగాణ సమాజం కోసం నీలాపనిందల్ని భరించి..తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను తెచ్చిన మహానుభావుడు మన నాయకుడుసీఎం కేసీఆర్’
‘కేసీఆర్ అనే మూడక్షరాల పదం లేకపోతే..ఆ వ్యక్తే లేకపోతే.. ఇయ్యాల టీ పీసీసీ ఎక్కడిది..టీ బీజేపీ ఎక్కడిది..? ఈ చిల్లర నాయాళ్లకుఆ పదవులు ఎక్కడివి.. అవి కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా?’
‘వీళ్లను దేకినోడెవ్వడు.. అడిగినోడెవ్వడు.. వీళ్లనెవడన్న అడిగిండా అసలు ఆంధ్రప్రదేశ్‌ల.. అసలీ చిల్లర బట్టెబాజ్గాళ్లను ఎడవన్న వట్టిచ్చుకున్నడా ఆంధ్రప్రదేశ్‌ల.. ఏవడీ రేవంత్‌రెడ్డి.. ఎవడా సంజయ్.. ఎప్పడన్న ఇన్నరా ఆసలా పేర్లు మీరు..’
‘మాకు మాట్లాడరాదా.. మాకు నోరు లేదా మేం నోరిప్పితె.. నాలిక వాడుడు మొదలు పెడితే మాకంటే బాగ ఎవడూ మాట్లాడలేడు.. మా కంటె బాగ ఎవరూ వాడలేడు’
‘తంబాకు బుక్కెటోడు ఒగడున్నడు కరీంనగర్ల పీకిందేం లేదు పోయి పాలమూరుల తిరుగుతాండు’
‘భారతీయ జనతా పార్టీ డప్ఫర్ నాయకుల్లారా..భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకుల్లారా..భారతీయ జనతాపార్టీ బఫూన్ నాయకులార్లా..నేనడుగుతా ఉన్న..ఏందీ మీరు జేసింది తెలంగాణకు?’
‘బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడుతమన్నరు ఎనిమిదేండ్లయే అడుగుముందుకు వడ్డదా? ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెడుతమన్నరు అడుగు ముందుకువడ్డదా’? ఎట్టిపనికైనా.. మట్టిపనికైనా..మనోడే ఉండాలె’
‘తెలంగాణ అనే పదానికే పర్యాయ పదం టీఆర్ఎస్ పార్టీ’
‘ధర్మన్నా రెండువేల పింఛనుకు .. రెండువేల ఐదువందల పింఛన్లకు ఒటేసేదిగాదు..తెలంగాణ తెచ్చిన నాయకుడు.. గా ఒక్క కారణం చాలు జీవితాంతం టీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యడానికి’
‘నాయకులుగా.. కార్యకర్తలుగా మనం ప్రజలకు చెప్పుదాం..అరవై ఏండ్లలో చెయ్యని ఎన్నో పనులు చేసినంమిగతా పని ఏమన్న బాకుంటె గదిగుడ జేస్తం 90శాతం చేసినోళ్లం.. మిగతా దస్ పర్సెంట్ పని మేం చెయ్యమా.. మా మీద నమ్మకముంచరా అని అడుగుదాం’
‘నిలదీసి అడుగాలె.. నిగ్గదీసి అడుగాలె ఏందయ్యా నువ్వు జేసింది తెలంగాణకు అని బీజేపీ పార్టీని
‘బుట్టాచోర్గాళ్లు.. బట్టెబాజ్గాళ్లు ఎట్లవడితె అట్ల మన నాయకుడి మీద మాట్లాడితే ఊకుందామా? పోరుగల్లు.. ఓరుగల్లు నుంచే మర్లవడుదాం.. మొన్న జనగామల ఎట్లయితే వాళ్ల సత్తా చూపెట్టిన్రో.. అదే పద్ధతిలో అవసరమైతే తిరుగబడి బుద్ధిచెబుదాం