హనుమకొండ చౌరస్తా, నవంబర్ 22 : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న రోజులవి. స్వరాష్ట్ర సాధన కోసం జనమంతా గళం విప్పి పోరుబాట పట్టిన సమయమది. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమనాయకుడు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భమది. కేసీఆర్ దీక్షకు సరిగ్గా వారం రోజుల ముందు నవంబర్ 23, 2009న కాకతీయ యూనివర్సిటీలో 50వేల మంది విద్యార్థులతో నిర్వహించిన సదస్సు ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. కేసీఆర్ ప్రసంగం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపింది. విద్యార్థి ఉద్యమానికి నాంది పలికింది. యూవత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసింది.
కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ 23, 2009న నిర్వహించిన కేసీఆర్ సభ తెలంగాణ ఉద్యమంలో ఓ మైలురాయిలా నిలిచింది. 2009 నవంబర్ 29వ తేదీన సిద్దిపేట వేదికగా ‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో ఆంధ్రా పాలకులు హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ అని ప్రకటిస్తే, 6వ జోన్లో అంతర్భాగం అనే డిమాండ్‌తో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయనకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎజెండాలను పకనపెట్టి 12 విద్యార్థి సంఘాలు టీఆర్ఎస్వీ, ఏబీఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, టీజీఏ, ఏబీవీపీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, కుల్సా, టీబీఎస్ఎఫ్, బీసీ వి ద్యార్థి సంఘం, టీవీవీ, కుర్సా సంఘాలు ఏకమై తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్‌జాక్) రాష్ట్రంలోనే కాకతీయ విశ్వవిద్యాలయంలో 2009 నవంబర్ 17న ఆవిర్భావించింది.
కేసీఆర్ దీక్షకు వారంరోజుల ముందు కాకతీయ విశ్వవిద్యాలయంలోని మొదటి గేట్ దగ్గరలో ఉన్న కాన్వకేషన్ గ్రౌండ్లో టీఎస్‌జాక్ ఆధ్వర్యంలో 50 వేల మంది విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ పాల్గొన్నారు. సదస్సులో మొదటగా 12 విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడారు. తర్వాత జయశంకర్ సార్ మాట్లాడారు. ప్రధాన వక్తగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, ఆంధ్రా పాలకుల నిరంకుశ దోపిడీ పాలన గురించి విద్యార్థులను ఈ సదస్సు ద్వారా చైతన్యం చేశారు. ఈ సభనే విద్యార్థి ఉద్యమానికి నాంది పలికింది.
తెలంగాణ ఉద్యమకారులు, ఇండ్ల నాగేశ్వర్రావు, మర్రి యాదవరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి జాక్ ఏర్పడింది. 12 విద్యార్థి సంఘాల బాధ్యులు టీఆర్ఎస్వీ వాసుదేవరెడ్డి, ఏబీఎస్ఎఫ్ జోరిక రమేశ్, ఏఐఎస్ఎఫ్ వలి ఉల్లా ఖాద్రీ, పీడీఎస్‌యూ రాజేందర్, ఏబీవీపీ పెంచాల శ్రీనివాస్, టీబీఎస్ఎఫ్ వొడపల్లి మురళి, టీజీఏ ఉషికేమల్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం ఎర్రబోజ్జు రమేశ్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం బూజుగుండ్ల అనిల్, కేయూ లా స్టూడెంట్స్ అసోసియేషన్ శ్రీనివాస్, కొప్పుల సైదిరెడ్డి, శ్రీరాం శ్యామ్, విద్యార్థి నాయకులు వేదిక మీద మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కేసీఆర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించారు.