మడికొండ, ఆగస్టు 3 : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. రైతుల రుణం మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మడికొండ చౌరస్తాలో గురువారం ఆయన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు తరహాలో విడుతల వారీగా రూ.19 వేల కోట్లు రైతు రుణాలు మాఫీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలోని రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పటికే రూ.17,351 కోట్ల రుణాలు మాఫీ చేయగా, ప్రస్తుతం రాష్ట్రంలోని 29.61లక్షల రైతుల కుటుంబాలకు రూ.19వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నట్లు చెప్పారు.
సమైక్య రాష్ట్రంలో దండగ అని చెప్పిన వ్యవసాయాన్ని తెలంగాణ సాధించుకున్న తర్వాత పండుగలా చేసి చూపిన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఇప్పటివరకు వర్ధన్నపేట నియోజకవర్గంలో 33,579 మంది రైతులకు రూ.150 కోట్ల రుణ మాఫీ జరిగిందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో రైతుబంధు ద్వారా 62,000 మందికి రూ.569.41కోట్ల డబ్బులు వారి ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. అలాగే, 714 మంది రైతులు ప్రమాదవశాత్తు చనిపోగా వారి కుటుంబాలకు రూ.32.70కోట్ల బీమా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మునిగాల సరోజన, ఆవాల రాధికారెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.