‘గండాలు కడతేర్చు వీరభద్రా’ అని భక్తజనం ప్రణమిల్లే సమయం ఆసన్నమైంది. కోరమీసాల స్వామికి వెండి, బంగారు మీసాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే తరుణం రానే వచ్చింది. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతిని పురస్కరించుకొని నేటి నుంచి 18దాకా అంగరంగవైభవంగా కొనసాగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారయంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం భద్రకాళీ, వీరభద్రస్వామి కల్యాణంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.
భీమదేవరపల్లి, జనవరి 9 : భక్తుల కొంగుబంగారం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతర ఈ నెల 18న స్వామివారి గ్రామపర్యటనతో ముగుస్తుంది. స్వామివారి కల్యాణ మహోత్సవ వేదిక సర్వాంగసుందరంగా ముస్తాబైంది. జాతరకు తెలంగాణలోని జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి సైతం భక్తజనం తండోప తండాలుగా తరలిరానున్నది. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామివారికి భక్తులు కోర మీసాలు సమర్పించను న్నారు. ఉత్సవాల్లో భక్తుల కోసం తాగునీరు, వైద్యశిబిరం, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో కిషన్‌రావు తెలిపారు. ఉత్సవాలకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
అడుగడుగునా నిఘా..
బ్రహ్మోత్సవాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణంలో నలువైపులా రూట్‌మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. ఎవరైన దారితప్పితే రూట్‌మ్యాప్ ఆధారంగా గమ్యం చేరుకునేలా సదుపాయం కల్పిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమా రు 300మంది పోలీస్ సిబ్బంది జాతర విధులు నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు.
ఆలయ ఆవరణలో రుద్రాక్ష వృక్షం
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామి వారి ఆలయంలో దేవతావృక్షాలైన రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చిలో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో రుద్రాక్ష చెట్టును భక్తు లు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.
స్థల పురాణం..
కాకతీయ రుద్రేశ్వరుడి కాలంలో మల్లికార్జున పండితుడి మనుమడు కేదారి పండితుడి ఆధ్వర్యంలో వీరభద్రస్వామి ఆలయం శైవాగమానుసారం నిర్మించినట్లు స్థలపురాణం చెబుతున్నది. క్రీ.శ. 1600లో కొంతమంది కుమ్మరులు కొండపైకి ఎడ్లబండ్లు కట్టుకొని పోయారు. అక్కడ వారికి కావాల్సిన కట్టెలు కొట్టుకొని ఎడ్లబండ్లలో వేసేందుకు చూడ గా ఎద్దులు, బండి కనిపించలేదు. కొండచుట్టూ తిరిగి అలసిపోయి ఆ రాత్రి కొండపైనే నిద్రించారు. వీరభద్రస్వామి వారికి కలలో కనిపించి ‘నన్నీ కొండపై నుంచి దింపి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్టించండి’ అని ఆజ్ఞాపించారు. దీంతో మల్లికార్జున పండితుడి మనుమడు కేదారి పండితుడు స్వామివారిని కిందకు దింపి ఆలయంలో ప్రతిష్టింపజేశారు.
పూర్తి సదుపాయాలు
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం. తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. స్నానాల గదులు, మరుగుదొడ్లు నిర్మించాం. వైద్యశిబిరం, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
– మాడిశెట్టి కుమారస్వామి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
జాతరలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రమే గాకుండా ప్రైవేట్ వైద్యశాలలు సైతం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా వాటర్ బాటిళ్లు పంపిణీ చేయనున్నాయి. వృద్ధుల కోసం జాతర ప్రాంగణంలో వాహనాలు ఏర్పాటు చేశాం.
– కిషన్‌రావు, ఆలయ ఈవో
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
కొత్తకొండ జాతరకు టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నది. వరంగల్-1 డిపో నుంచే కాకుండా హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోల నుంచి నేరుగా కొత్తకొండకు స్పెషల్ బస్సులు నిరంతరం నడువనున్నాయి.