తీవ్రమైన ఎండలు, ఒంటరి తనం
ప్రవాసి ప్రజావాణిలో కుటుంబ సభ్యుల వేడ్కోలు
స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
Gulf | భీమదేవరపల్లి, జూన్ 28 : సౌదీ అరేబియాలో మరో వలస కార్మికుడి జీవితం చిధ్రమౌతుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ వాసి తాళ్ళపల్లి ఈశ్వర్ సౌదీ అరేబియా దేశంలోని ఓ ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం పొట్ట కూటికోసం గల్ఫ్ వెళ్ళిన ఈశ్వర్ మొదటగా హౌస్ డ్రైవర్‌గా పనిలో చేరాడు. కొద్ది నెలలకే అతను ఉద్యోగం కోల్పోయాడు. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు ఒంటరితనం దేశం కాని దేశంలో ఏమి చేయాలో అర్థం కాలేదు. చివరకు ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిలో చేరాడు. ఎలాగైనా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ వచ్చేందుకు డబ్బులు చాలక అక్కడే ఉండిపోయాడు. ఏడేళ్ళు గడిచిపోవడంతో ఇంటికి వెళ్తాను అనే నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. తాను గల్ఫ్‌లో పడుతున్న బాధలను అతని భార్య, పిల్లలకు ఫోన్ చేసి చెప్పుకున్నాడు.
దీంతో ఈశ్వర్ భార్య తాళ్ళపల్లి లత, ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి హైదారాబాద్‌లోని ప్రవాసి ప్రజావాణిలో తన భర్తను స్వదేశానికి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అర్జీ పెట్టింది. ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి స్వయంగా వెంట ఉండి వారికి దిశానిర్దేశం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జీఏడీ ఎన్ఆర్ఐ అధికారులతో మాట్లాడి సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈశ్వర్ పాస్ పోర్ట్ యజమాని వద్ద డిపాజిట్ చేయడం, వీసా, అఖామా గడువు ముగిసిపోవడం ఈశ్వర్ స్వదేశానికి తీసుకురావడానికి ప్రధాన సమస్యగా మారింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ జబ్బార్ సౌదీలో సహకరించడంతో అతనికి కాస్త ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి ఈశ్వర్‌ను స్వదేశానికి రప్పించాలని అతని భార్య లత విజ్ఞప్తి చేసింది. ఈశ్వర్‌ను స్వదేశానికి తప్పక తీసుకువస్తామని అతని భార్య లతకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఈశ్వర్ రాక కోసం అతని కుటుంసభ్యులు వేచి చూస్తున్నారు.