వరంగల్, జూన్ 4 : ఆలయాల అభివృద్ధికి అవసరమైన మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ధార్మిక సలహాదారులు గోవిందం హరికి సూచించినట్లు ఆమె తెలిపారు. బుధవారం నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో రూ.1.03 కోట్లతో వేద పాఠశాల భవనం, ఆలయం నలువైపులా రాజగోపురాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ భద్రకాళీ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని రూ.30 కోట్లతో మాడ వీధులు, నలువైపులా రాజగోపురాలు నిర్మిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేస్తామన్నారు.
త్వరలోనే భద్రకాళీ ఆలయ పాలకమండలి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆలయాల అర్చకులకు త్వరలోనే పదోన్నతులు కల్పించడంతో పాటు దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత తీరుస్తామని తెలిపారు. ఆలాగే దేవాదాయ శాఖ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలన్నారు. భూములు ఆక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భద్రకాళీ చెరువు పూడికతీత సాహసోపేతమైన నిర్ణయమని నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం ఈ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. వర్షాకాలంలో చెరువులో రెట్టింపు నీటి నిల్వలు ఉంటాయన్నారు. ఖిలావరంగల్‌లో 14 ఆలయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆర్కియాలజీ పరిధిలో ఉన్న ఈ ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు పూజలు జరిగేలా చొరవ తీసుకుంటామన్నారు. ఖిలా వరంగల్‌లోని ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తే కోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, ఈవో శేషుభారతి, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, ఆలయ ట్రస్టీ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, వేద పండితులు పాల్గొన్నారు.