వరంగల్ చౌరస్తా: కాకతీయ మెడికల్ కళాశాల ఉమెన్స్, మెన్స్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (కేఎంసీ హాస్టల్ వర్కర్స్) విభాగం ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించారు. కళాశాల ప్రధాన ద్వారం ముందు ఆందోళన చేపట్టారు. సుమారు ఆరు నెలలుగా వేతనాలు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. విధులకు కొనసాగింపునకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయకపోవడంతో పాటుగా విధులు నిర్వహించిన కాలానికి సైతం వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, విధులు నిర్వహించిన కాలానికి వేతనాలు చెల్లించాలని కోరారు.