నయీంనగర్, జూలై 8: కిడ్నాప్ గ్యాంగ్‌ను కేయూ పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. 2012 సంవత్సరంలో హనుమకొండ నయీంనగర్‌లోని పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్‌ను కంచనకుంట్ల సునీల్‌రెడ్డి, హరీశ్‌రెడ్డి, బండారి సదానందం పార్ట్నర్ షిప్లో ప్రారంభించారు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు రావడంతో 2017లో సదానందం దాన్ని రూ. 11లక్షలకు తీసుకొని, తన భార్య అనిత పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అకాడమీని పటిష్టం చేశాడు. ఇందులో ఎలాగైనా 50 శాతం వాటా దక్కించు కోవాలని సునీల్‌రెడ్డి కాజీపేట ఏసీపీ తమ్ముడు పింగిళి ప్రదీప్‌రెడ్డిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో జూన్30న ఎర్రగట్టు గుట్ట సమీ పంలో వారు తమ అనుచరులతో రెండు కార్లు, మోటర్ బైక్‌పై సదానందంను బలవంతంగా కిడ్నాప్ చేసి ప్రదీప్‌రెడ్డి స్వగ్రామం కమలాపూర్ మండలం శనిగరానికి తీసుకువెళ్లారు.
సదానందంను కొట్టి బాండ్పేపర్స్పై సంతకాలు తీసుకున్నారు. ఇదేకాకుండా ముఠా సభ్యుల్లో కొందరు సదానందం ఇంటికి వచ్చి అతడి భార్యతో బాండ్‌పేపర్స్ మీద సంతకాలు పెట్టించే ప్రయత్నం చేయగా ఆమె నిరాకరించింది. రెండు రోజుల్లో నీ భార్యతో సంతకాలు పెట్టించాలని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కిడ్నాప్ ముఠా సదానందంను మధ్యాహ్నం వదిలిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రదీప్‌రెడ్డి, అతని అనుచరులు సునీల్‌రెడ్డి ఆఫీస్ వద్ద కేసు గురించి మాట్లాడు కుంటున్నారనే పక్కా సమాచారంతో కేయూ సీఐ రవికుమార్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది 14మందిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌లో ఉపయోగించిన రెండు కార్లు, ఒక టూవీలర్, 13 సెల్ ఫోన్లు, స్టాంప్ కాగితాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.