గాలె : ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు రేసులో నిలవాలంటే ఇకనుంచి ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు శనివారం నుంచి ఆతిథ్య జట్టుతో స్పిన్ సమరానికి సిద్ధమవుతున్నది. టీమిండియాతో పోలిస్తే పేపర్‌పై లంక జట్టు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ సొంతగడ్డపై లంకేయులు సింహాల్లా గర్జించగలరు. ఏండ్లుగా తమ అమ్ములపొదిలో దాగిన స్పిన్ అస్త్రంతోనే గిల్ సేనను బోల్తా కొట్టించేందుకు ఆ జట్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా పర్యాటక జట్టుకు లంక స్పిన్ ద్వయం ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ నుంచి ముప్పు పొంచి ఉంది. మొదటి టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న గాలెలో ఈ ఇద్దరికీ తిరుగులేని రికార్డు ఉంది. ప్రత్యర్థి ఎంత మేటి బ్యాటర్ అయినా గాలెలో వీరి ఉచ్చులో చిక్కుకుని బయటపడటం అంత సులభమేమీ కాదన్నది గణాంకాలు చెబుతున్న కఠిన వాస్తవం.
క్రికెట్లో కొంతమంది ఆటగాళ్లకు ఎంతో ఇష్టమైన, తాము అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేసే స్టేడియాలు కొన్ని ఉంటాయి. మిగతా వేదికల కంటే అక్కడ వారు మరింత మెరుగ్గా రాణించగలరు. సచిన్‌కు వాంఖెడే, కోహ్లీకి అడిలైడ్ (ఆస్ట్రేలియా), దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కు కొలంబో మాదిరిగా ప్రస్తుత లంక జట్టులో ఉన్న జయసూర్య, మెండిస్‌కు గాలె వెరీ వెరీ స్పెషల్. ఈ ఇద్దరూ కలిసి ఇక్కడ 23 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 145 వికెట్లు పడగొట్టారంటే అక్కడ వీరి ఆధిపత్యం ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. లెఫ్మార్ట్ స్పిన్నర్ జయసూర్య 11 టెస్టుల్లోనే 81 వికెట్లు తీస్తే ఆఫ్ స్పిన్నర్ మెండిస్ 12 మ్యాచుల్లో 64 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇద్దరినీ నిలువరించడం భారత బ్యాటర్లకు శక్తికి మించిన పనే. గాలి అధికంగా వీచే గాలెలో దానిని సద్వినియోగం చేసుకుని ఫ్లైటెడ్ డెలివరీలతో బ్యాటర్లను బుట్టలో వేసుకోవడంలో ప్రభాత్ సిద్ధహస్తుడు. జట్టు సహచరులు ‘కింగ్ ఆఫ్ గాలె’గా పిలుచుకునే అతడి స్పిన్ తంత్రాన్ని ఛేదించి పరుగులు రాబట్టాలంటే గిల్ అండ్ కో. చెమటోడ్చాల్సిందే.
ఒకప్పుడు భారత బ్యాటర్లు స్పిన్ ఆడటంలో ఆరితేరినవారు. స్వదేశంలో స్పిన్‌తోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టి ఆ తర్వాత అపోజిషన్ బౌలర్ల (ముఖ్యంగా స్పిన్నర్ల)ను చీల్చిచెండాడటంలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉండేది. షేన్ వార్న్, మురళీధరన్ వంటి దిగ్గజ స్పిన్నర్లను ద్రావిడ్, సచిన్, లక్ష్మణ్, సెహ్వాగ్ వంటి బ్యాటర్లు నిలువరించి సెంచరీల మీద సెంచరీలు కొట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. సొంతగడ్డపై 2024లో న్యూజిలాండ్ కొట్టిన చావుదెబ్బ నుంచి తేరుకోకముందే నిరుడు దక్షిణాఫ్రికా సైతం భారత్‌ను వైట్‌వాష్ చేయడం జట్టుకు కోలుకోలేని దెబ్బ. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు అజాజ్ పటేల్, మిచెల్ శాంట్నర్ నాటి రోహిత్ సేనకు చుక్కలు చూపిస్తే 2025లో సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సిమోన్ హర్మర్ దెబ్బకు ఆకాశంలో విహరించిన టీమిండియాను అమాంతం నేలకు దించాడు. ఇక ఇప్పుడు ప్రభాత్ కూడా లెఫ్మార్మ్ స్పిన్నరే. భారత బ్యాటర్ల బలహీనతే అతడి బలం. అతడికి తోడు రమేశ్ కూడా మరో ఎండ్‌లో దాడి చేయనుండటంతో రెండువైపులా భారత్‌కు ముప్పు తప్పదు. ప్రస్తుతం ఉన్న జట్టులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాకు తప్ప మిగిలిన బ్యాటర్లను ఇక్కడ ఆడిన అనుభవం లేకపోవడం భారత్‌కు ప్రతికూలాంశం. కానీ ఈ స్పిన్ ద్వయం నుంచి ఎదురయ్యే ముప్పును దాటితేనే సిరీస్‌లో భారత విజయావకాశాలు మెరుగుపడతాయి. మరి గిల్ సేన ఏం చేస్తుందనేది ఆసక్తికరం.