హుజూర్నగర్, సెప్టెంబర్ 29 : మోసకారి కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హుజూర్ నగర్ లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల నేపథ్యంలో ఓటర్ లిస్టు పరిశీలించి ముఖ్య నాయకులకు, ఎమ్మెల్సీ ఓటర్లకు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. గణేష్ నిమజ్జన సమయంలో ఎక్కడ చూసినా సారే రావాలంటున్నారు అంటూ యువత కేసీఆర్ పాటలతో హోరెత్తించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు అని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు కనుసైగల్లో తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ని ఎక్కు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డిదేనని అన్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయి ఉంటారని అన్నారు. ఆంధ్రాకి నీళ్లని దర్పణం చేసి తెలంగాణ పొలాలను ఎండబెడుతున్నది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా ముందుకు సాగాలన్నారు. రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాస్తవాలను మాట్లాడుతున్నారన్నారు. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డులు ఇచ్చిందని స్వయానా ఇదే విషయాన్ని అసెంబ్లీలో భట్టితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తావించినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదని అందుకే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కూడా ప్రజలు హాజరు కావట్లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, షేక్ అలీ, అబ్దుల్ నబీ, సుందర్ రావు పాల్గొన్నారు.