న్యూఢిల్లీ : ఉబర్, ఓలా, ఇతర రైడ్ యాప్‌ల ద్వారా ఆటోలు, క్యాబ్‌లను బుక్ చేసుకునే ప్రయాణికులు ప్రయాణానికి ముందే టిప్ చెల్లించాల్సిన అవసరముండదు. క్యాబ్ త్వరగా దొరుకుతుందని, ప్రయాణం త్వరగా ముగుస్తుందని ఆశపెట్టి అదనపు చెల్లింపు చేయడానికి ప్రయాణికులను ప్రోత్సహించకూడదని పేర్కొంటూ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మోటర్ వాహన అగ్రిగేటర్లను వారి యాప్‌ల నుంచి ప్రయాణానికి ముందు టిప్ ఇవ్వమని అడిగే సూచనలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
బుకింగ్ ప్రక్రియ సమయంలో రైడ్ యాప్‌లు ముందస్తు టిప్, యాడ్ ఆన్‌ను ఎంచుకోండి, మీ రైడ్ త్వరగా ఖరారయ్యే అవకాశాలను మెరుగుపరుచుకోండి వంటి సందేశాలను ప్రదర్శిస్తున్నాయని వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.