‘భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే.. రానున్న రోజుల్లో మనమే అధికారంలోకి వస్తాం. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. పాలనలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇచ్చిన హామీల్లో ఒక్క శాతం కూడా పూర్తి చేయలే. 10 శాతం హామీలే ఇచ్చి జనం అడగని 90 శాతం పథకాలు ప్రజలకు అందించిన ఘనత బీఆర్ఎస్ది. మనకన్నా మంచిగ చేస్తామని ఊదరగొడితే ప్రజలు నిజమేనని గెలిపించారు. వారు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు.
కష్టపడి పనిచేస్తే అన్ని ఎన్నికల్లోనూ విజయాలు మనవే’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఇంట్లో శనివారం పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ను కలిశారు. ఈ సంద ర్భం గా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి తనతో పాటు 300 మంది కార్యకర్తలతో బీఆర్ఎస్లో చేరారు.
– దేవరుప్పుల, నవంబర్ 9
అడ్డగోలు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, రానున్న రోజులు మనవే, మళ్లీ మన పార్టీనే అధికారంలోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో కేసీఆర్ను శనివారం పాలకుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు కలవడంతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి 300 మంది కార్యకర్తలతో గులాబీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడుతూ జనం కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయామని తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ప్రజలకేం తక్కువ చేయలేదని, కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓట్లు వేశారని, అవి చేతల రూపం దాల్చవనే విషయం ప్రజలకు బోధపడిందన్నారు. ఇక ఏ ఎన్నికలు ఇచ్చినా జనం బీఆర్ఎస్ వెంటే ఉంటారనేది అక్షర సత్యమన్నారు. మనం కష్టపడి పనిచేస్తే స్థ్ధానిక సంస్థల మొదలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు అన్ని విజయాలు మనవేనని కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలని, నిర్మాణం చేయాలని, పది మందికి లాభం జరగాలని, ముఖ్యంగా రైతులు, సామాన్యులకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. ఇదంతా పక్కనబెట్టి ప్రతిపక్ష పార్టీ వాళ్లను లోపల వేస్తామని ఊదరగొడుతున్నారని, ఇదేనా వాళ్లు చేసే అభివృద్ధి అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీల్లో ఒక్క శాతం పూర్తి చేయలేదని, అదే మన ప్రభుత్వం జనం అడగని పథకాలు ప్రజలకు అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, కేవలం అధికారం చేజిక్కించుకునేందుకే అనేక అలవికాని హామీలు ఇవ్వడంతో ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదని, ప్రజలు పునరాలోచిస్తున్నారన్నారు. రానున్నది మనపాలనే అని, ప్రజలకు రెట్టింపు అభివృద్ధి, సంక్షేమాలు అందించి బీఆర్ఎస్ మార్కు పాలన చూపుదామన్నారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడాల్సిన పనిలేదని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. లీగల్గా పోరాడుదామని పేర్కొన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ తన స్వచ్ఛంద సంస్థతో అనేక మందికి చేయూతనిచ్చిన శ్రీనివాసరెడ్డి చేరిక పాలకుర్తిలో బీఆర్ఎస్కు కొండంత బలాన్ని ఇచ్చిందన్నారు. ఆపద వస్తే నేనున్నానంటూ రెక్కలు కట్టుకుని వాలే శ్రీనివాసరెడ్డి లాంటి వారు పార్టీకి బలం చేకూర్చుతారని పేర్కొన్నారు. ము ఖ్యంగా రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్టేనన్నారు.