హనుమకొండ, డిసెంబర్ 5 : నేటి యువతరానికి ఆదర్శం కేసీఆర్ స్వరాష్ట్ర పోరాటమని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. కేసీఆర్ ఉద్యమ చరిత్ర, త్యాగాలు, పోరాటాన్ని నేటి తరానికి తెలిపేందుకే దీక్షా దివస్ కార్యక్రమాన్ని11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వ్యాసరచన పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ.. నేటి తరానికి తెలంగాణ ప్రాంత చరిత్ర, వెనుకబాటు, 60 ఏండ్ల అణచివేత, 14 ఏండ్ల కేసీఆర్ స్వరాష్ట్ర పోరాటం, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, సంక్షేమం, అభివృద్ధిని వివరించాల్సిన అవసరముందన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదు.. కేసీఆర్, తెలంగాణలోని సకల జనుల పోరాటంతోనే స్వరాష్ట్రం వచ్చిందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్నీ నెరవేర్చుకున్నామన్నారు. దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పోరాటం మరువలేనిదన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నేటి విద్యార్థులకు కేసీఆర్ పోరాటం, ఉద్యమ నేపథ్యం, తెలంగాణ అభివృద్ధిని తెలిపేందుకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగారని, నాటి పోరాట దీక్షను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఏడాది11 రోజుల పాటు దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు నాడు ఉద్యమానికి కేంద్రాలయ్యాయని, కేసీఆర్ పోరాటానికి విద్యార్థులు వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. కేసీఆర్ ఉద్యమ చరిత్రను నేటి విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ కత్తెరపెల్లి దామోదర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ గండ్రకోట రాకేశ్‌యాదవ్, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు గొల్లపెల్లి వీరస్వామి, పస్తం అనిల్ కుమార్, కోరపెల్లి రాజేశ్, రాసూరి రాజేశ్, స్నేహిత్, భార్గవ్, పవన్, మహేశ్, బీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, జోరిక రమేశ్ పాల్గొన్నారు.